జియో సిమ్ కోసం కస్టమర్ల క్యూ..
దేశవ్యాప్తంగా అనూహ్య డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : యాపిల్ ఫోన్ల కోసం క్యూలు కట్టడం ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైంది. ఇప్పుడు రిలయన్స్ జియో ప్రవేశంతో ఆ ట్రెండ్ భారత్‌లోనూ ప్రస్ఫుటమవుతోంది. అయితే ఇక్కడ దర్శనమిస్తున్న క్యూలైన్లు మొబైల్ ఫోన్ల కోసం కాదు. జియో ఇచ్చే ఉచిత సిమ్‌ల కోసం. సిమ్ చేతికొచ్చిందా జియో ప్రివ్యూ ఆఫర్‌తో 90 రోజులపాటు అపరిమిత డేటా, కాల్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకేముంది దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్లు, లైఫ్ మొబైల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు స్వాగతం పలుకుతున్నాయి. 4జీ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత సిమ్‌తోపాటు ప్రివ్యూ ఆఫర్‌ను వర్తింపజేస్తుండడంతో కస్టమర్లతో ఈ స్టోర్లు కిటకిటలాడుతున్నాయి.
నల్ల బజారులో రూ.2 వేలకు..: ప్రివ్యూ ఆఫర్ కింద 4జీ డేటా, వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ కాల్స్, 10 రకాల జియో ప్రీమియం యాప్స్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చు. తొలుత రిలయన్స్ ఉద్యోగులు, వారి బంధువులకు.. ఆ తర్వాత లైఫ్ స్మార్ట్‌ఫోన్ కొన్న కస్టమర్లకు 90 రోజులపాటు ప్రివ్యూ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. లైఫ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోకపోయినా కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ప్రివ్యూ ఆఫర్‌ను విస్తరించింది. ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి కస్టమర్ ప్రివ్యూ ఆఫర్‌కు అర్హులు. దీంతో దేశవ్యాప్తంగా కస్టమర్లు సిమ్‌ల కోసం ఎగబడ్డారు. వినియోగదార్లు ఒకేసారి స్టోర్లను చుట్టుముట్టడంతో సిమ్‌ల కొరత కూడా తలెత్తింది. కొందరు కస్టమర్లు ఇదే అదనుగా రూ.1,500-2,000లకు సిమ్‌లను తిరిగి విక్రయిస్తున్నట్టు సమాచారం. సిమ్‌లు పక్కదారి పట్టకుండా అసలైన కస్టమర్లకే చేరేలా కంపెనీ కసరత్తు చేస్తోంది.
క్యూ కట్టిన కంపెనీలు..
హైదరాబాద్‌లో 50 లక్షలకుపైగా 4జీ మొబైల్ వినియోగదార్లు ఉన్నారు. గురువారం ఒక్కరోజు బిగ్ సి స్టోర్లలో 2,500లకుపైగా, లాట్ మొబైల్స్ ఔట్‌లెట్లలో అదే స్థాయిలో 4జీ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడయ్యా యి. 4జీ ఫోన్ కొన్న వినియోగదార్లకు ఈ స్టోర్లలో అప్పటికప్పుడు సిమ్‌ను జారీ చేస్తున్నారు. ఇక జియో బండిల్ ఆఫర్‌ను అందించేందుకు మొబైల్ ఫోన్ కంపెనీలు క్యూ కట్టాయి. జియోతో తొలుత శామ్‌సంగ్, ఎల్‌జీ.. తర్వాత జియోనీ, కార్బన్, లావా, ఆసస్, టీసీఎల్, ఆల్కటెల్, ప్యానాసోనిక్, మైక్రోమ్యాక్స్, యూ వంటి బ్రాండ్లు చేతులు కలిపాయి. ఈ స్థాయిలో బండిల్ ఆఫర్ రావడం దేశంలో ఇదే తొలిసారి. శామ్‌సంగ్ తాజాగా రూ.4,590లకే జెడ్2ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. జియో సేవల నేపథ్యంలో ఫీచర్ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికే ఈ ధరలో జెడ్2ను తీసుకొచ్చింది.