నమ్మకం పోగొట్టుకున్నందుకే మిస్త్రీపై వేటు
ముంబై: దిగ్గజ గ్రూప్‌ను ముందుకు నడిపించే విషయంలో సైరస్ మిస్త్రీపైనా, ఆయన సామర్ధ్యంపైనా నమ్మకం కోల్పోయినందునే బోర్డు ఉద్వాసన పలికిందని టాటా సన్‌స తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. బోర్డుకు, మిస్త్రీకి మధ్య ఉన్న సత్సంబంధాలు క్రమంగా చెడ్డాయని, సరిదిద్దుకునేందుకు అనేక అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. మిస్త్రీ ఉద్వాసనకు ఇది కూడా కారణమన్నారు. డెరైక్టర్‌గా మిస్త్రీని తొలగించే ప్రత్యేక తీర్మానానికి మద్దతు కూడగట్టే దిశగా షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో రతన్ టాటా ఈ విషయాలు వివరించారు. ఉద్వాసనకు గురైన వ్యక్తిని బోర్డు పదవుల్లో కొనసాగించడం వల్ల గ్రూప్ కంపెనీల కార్యకలాపాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ’డెరైక్టరుగా ఆయన రాజీనామా చేసి ఉంటే బాగుండేది.
దురదృష్టవశాత్తూ ఆయన ఇంకా చేయలేదు. డెరైక్టరు హోదాలో ఆయన అలాగే కొనసాగడం ఆయా కంపెనీల బోర్డులపై విధ్వంసక ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధాన ప్రమోటర్ అయిన టాటా సన్‌సని ఆయన బాహాటంగానే విరోధిస్తున్న నేపథ్యంలో కంపెనీ పనితీరు దెబ్బతినవచ్చు’ అని రతన్ టాటా పేర్కొన్నారు. చైర్మన్ హోదా నుంచి తనంతట తానే వైదొలిగేందుకు మిస్త్రీకి అవకాశం కల్పించినప్పటికీ, ఆయన తోసిపుచ్చారని టాటా వివరించారు. మిస్త్రీ తొలగింపు అంశంపై నిర్ణయానికి సంబంధించి టాటా గ్రూప్‌నకు చెందిన ఆరు సంస్థలు ఈ నెలలో అసాధారణ సర్వ సభ్య సమావేశాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.