
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పలు ఊరట చర్యలు ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీని జూన్ 30 వరకూ పొడిగించారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 30 వరకూ ఉంది. పాన్, ఆధార్ లింకింగ్‌కు డెడ్‌లైన్‌ను కూడా మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ పొడిగించారు. ఇక ఆదాయ వివరాల దాఖలుపై లేటు ఫీజును 12 శాతం నుంచి 9 శాతానికి తగ్గించామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
వివాద్ విశ్వాస్ స్కీమ్ గడువు కూడా జూన్ 30 వరకూ పెంచారు. రూ 5 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలకు జీస్‌టీ రిటర్న్స్‌పై వడ్డీ, లేటు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రూ 5 కోట్లకు మించిన టర్నోవర్ కలిగిన కంపెనీలకు లేటు ఫీజు ఉండదు..కానీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ -19 ఆర్థిక వ్యవస్ధపై చూపే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక ప్యాకేజ్‌పై కసరత్తు సాగుతోందని, ఇది పూర్తయిన వెంటనే వివరాలు ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ప్రత్యక్ష పన్నులు, దివాలా చట్టం అమలుపై కొన్ని కీలక చర్యలు తీసుకుంటామని చెప్పారు. బ్యాంకింగ్, వాణిజ్యం, ఫిషరీస్, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని అన్నారు.
నగదు విత్‌డ్రాలపై ఆంక్షల సడలింపు
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నగదు విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలను సవరించారు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలుండవని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా చార్జీల భారం లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ పరిమితిని కూడా తొలగించారు. లాక్‌డౌన్ సమయంలో ఈ చర్యలు సామాన్య ప్రజలకు కొంత మేర ఊరట కల్పిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment