నిర్ణయంపై ‘ఏ ప్రభావం’ పడదు: జైట్లీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ పదవీకాలం సెప్టెంబర్ 4 తరువాత రెండవసారీ పొడిగించాలా... వద్దా అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంపై ‘ఏ అంశం ప్రభావం’ పడబోదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం స్పష్టం చేశారు. తక్షణం రాజన్‌ను తొలగించాలన్న బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ను విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ప్రభుత్వం, ఆర్‌బీఐ బాధ్యతాయుతమైన సంస్థలు.
మరే ఇతర అంశం ప్రభావం లేకుండా రెండు సంస్థలూ తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఆయన ఈ ఒక చానల్‌తో వ్యాఖ్యానించారు. స్వామి ఆరోపణలపై వ్యాఖ్యానించాలని కోరినప్పుడు ఆయన మాట్లాడుతూ, ‘‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థికమంత్రిత్వశాఖల మధ్య సంబంధాలు, విధానపరమైన చర్చలు పూర్తి సజావుగా, పరిపక్వ స్థాయిలో ఉన్నాయి. వాటిపై (ప్రతికూల వ్యాఖ్యలు) వ్యాఖ్యానించడం సరికాదు’’ అని మాత్రం అన్నారు.
స్వామి అసలు లక్ష ్యం జైట్లీనే: రమేశ్
కాగా సుబ్రమణ్యస్వామి నిజమైన లక్ష్యం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీనే అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. ఆయనను ఏమీ అనలేక... బహిరంగంగా తన అభిప్రాయాలు వెల్లడించని ఆర్‌బీఐ గవర్నర్‌పై స్వామి ‘డమ్మీ’ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజన్ ఆర్థిక శక్తిసామర్థ్యాలు ప్రపంచం అంతటికీ తెలుసనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఆర్‌బీఐని పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆర్థిక వ్యవహారాల బీజేపీ ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ, సీనియర్ నాయకునిగా స్వామి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని అన్నారు.