
అధిక జీఎస్‌టీతో చైనా ఫర్నిచర్‌కు ఊతం
జీఎస్‌టీలో ఫర్నిచర్‌ను 28% పన్ను శ్లాబులోకి చేర్చడంపై తెలంగాణ ఫర్నిచర్ తయారీదారుల సంఘం, అఖిలభారత ఫర్నిచర్ సంస్థల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
దేశీ పరిశ్రమ మూతపడుతుంది
ఫర్నిచర్ తయారీ సంఘాల ఆందోళన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎస్‌టీలో ఫర్నిచర్‌ను 28% పన్ను శ్లాబులోకి చేర్చడంపై తెలంగాణ ఫర్నిచర్ తయారీదారుల సంఘం, అఖిలభారత ఫర్నిచర్ సంస్థల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే సాధారణ ఫర్నిచర్‌నూ కేంద్రం లగ్జరీ వస్తువులుగా పరిగణించి 28% పరిధిలోకి తేవటం దారుణమని ఆయా సంఘాల ప్రతినిధులు కొండా శ్రావణ్ కుమార్, సతీష్, నందకిషోర్ వాపోయారు. బుధవారమిక్కడ తమ సంఘాల ప్రతినిధులతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం చర్య వల్ల చిన్న పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుందని, దీనిపై ఆధారపడ్డ ఎంతో మంది రోడ్డున పడతారని చెప్పారు.
‘‘18% కన్నా ఎక్కువ పన్ను కేవలం లగ్జరీ వస్తువులపైనేనని కేంద్రం చెబుతోంది. మరి ఫర్నిచర్ లగ్జరీ వస్తువా?’’ అని ప్రశ్నించారు. ఇంపోర్టెడ్ ఫర్నిచర్‌పై కస్టమ్స్, ఎక్సైజ్, వ్యాట్ అన్నీ కలిపి 45% పన్నులుండగా జూలై 1 నుండి జీఎస్‌టీ 28%, 11% కస్టమ్స్ డ్యూటీ కలిపితే 39 శాతమే అవుతుందని, విదేశీ ఫర్నిచర్‌పై 6% పన్ను తగ్గుతుందన్నారు.
దీనివల్ల చైనా ఫర్నిచర్ వెల్లువెత్తే అవకాశముందని శ్రావణ్ కుమార్ చెప్పారు. ‘‘మరోవైపు దేశీయ ఫర్నీచర్‌పై 14.5%గా ఉన్న పన్ను 28% అవుతోంది. దీంతో అమ్మకాలు పడిపోతాయి’’ అని ఆందోళన వ్యక్తంచేశారు. తాజా పరి ణామాలతో ఈ రంగంపై ఆధారపడ్డ లక్షల మంది చిన్నా చితకా తయారీదార్లు రోడ్డున పడతారని కరీం నగర్‌కు చెందిన వ్యాపారి పవన్ కుమార్ చెప్పారు. పరిశ్రమను కాపాడాలని గృహ శోభ ఫర్నీచర్ ప్రమోటర్ శంకర్ అగర్వాల్ ప్రభుత్వాన్ని కోరారు.