బంగారానికి డిమాండ్‌ డౌన్‌ | Demand down to gold | Sakshi
Sakshi News home page

బంగారానికి డిమాండ్‌ డౌన్‌

Published Fri, Nov 10 2017 12:19 AM | Last Updated on Fri, Nov 10 2017 12:04 PM

Demand down to gold - Sakshi

ముంబై: పసిడి కళ తప్పింది! ప్రపంచ వ్యాప్తంగానే కాదు, దేశీయంగానూ డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ ఏడాది జూలై – సెప్టెంబర్‌ క్వార్టర్లో దేశీయంగా డిమాండ్‌ 24 శాతం క్షీణించి 145.9 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. జీఎస్టీ అమలు, మనీల్యాండరింగ్‌ వ్యతిరేక చట్టం కారణంగా బంగారం కొనే విషయంలో కస్టమర్లు ఆచితూచి వ్యవహరించడమే డిమాండ్‌ క్షీణతకు కారణం. గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో బంగారం దిగుమతులు 193 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి తన నివేదికలో పేర్కొంది. విలువ పరంగా చూస్తే గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.55,390 కోట్ల విలువైన బంగారం దిగుమతి కాగా, గత క్వార్టర్లో అది 38,540 కోట్లకు పరిమితమైంది.  

ఆభరణాలకూ ఆదరణ తక్కువే...
ఈ కాలంలో ఆభరణాలకూ డిమాండ్‌ తగ్గిపోయింది. 25% తగ్గి 114.9 టన్నులుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 152.7 టన్నుల ఆభరణాలు విక్రయమయ్యాయి. విలువ పరంగా ఆభరణాల డిమాండ్‌ గతేడాది ఇదే కాలంలో ఉన్న రూ.43,880 కోట్ల నుంచి 30,340 కోట్లకు తగ్గింది.  

పెట్టుబడులకూ వెనుకంజ!
బంగారంపై పెట్టుబడుల విలువ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 31 టన్నులుగా నమోదైంది. దీని విలువ రూ.8,200 కోట్లు. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 40.1 టన్నులతో పోల్చుకుంటే 31 శాతం తక్కువ. విలువ పరంగా చూస్తే 11,520 కోట్ల కంటే తక్కువ. సెప్టెంబర్‌ క్వార్టర్లో దేశీయంగా 26.7 టన్నుల బంగారం రీసైకిల్‌ (పాత బంగారాన్ని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం) జరిగింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 25.7 టన్నులు కావడం గమనార్హం.  

9 నెలల తర్వాత...
మూడు వరుస త్రైమాసికాల్లో బంగారు ఆభరణాలకు డిమాండ్‌ వృద్ధి చెందగా సెప్టెంబర్‌ క్వార్టర్లో మాత్రం 25 శాతం తగ్గిందని ప్రపంచ స్వర్ణమండలి భారత మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు. అలాగే, బార్లు, కాయిన్ల డిమాండ్‌ సైతం 23 శాతం తగ్గి 31 టన్నులుగానే ఉందన్నారు.

‘‘బంగారం డిమాండ్‌  24 శాతం తగ్గింది. కొత్తగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ, యాంటీ మనీ ల్యాండరింగ్‌ చట్టం వల్ల రిటైల్‌ లావాదేవీలు తగ్గాయి’’ అని సోమసుందరం వివరించారు. అయితే, బంగారం పరిశ్రమ క్రమంగా జీఎస్టీకి మారిపోతుండటం, యాంటీ మనీల్యాండరింగ్‌ చట్టం ఆభరణాలపై ఎత్తివేయడంతో, డిసెంబర్‌ త్రైమాసికంలో డిమాండ్‌ రికవరీ అయ్యే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నట్టు  పేర్కొన్నారు.


2018 బాగుండొచ్చు
‘‘బంగారం డిమాండ్‌కు ఆటంకాలు కొనసాగుతాయి. 2016 ప్రారంభం నుంచి పారదర్శకత దిశగా తీసుకున్న చర్యలే ఇందుకు కారణం. ఈ ఏడాది పూర్తి డిమాండ్‌ గత ఐదేళ్ల సగటు కంటే తక్కువే ఉంటుంది. 650–750 టన్నుల మధ్య ఉండొచ్చు. లేదా ఇంతకంటే ఇంకా తగ్గొచ్చు’’ అని సోమసుందరం పేర్కొన్నారు. 2018లో మాత్రం పసిడికి డిమాండ్‌ మెరుగ్గా ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ‘‘2018లో రికవరీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంచనా. ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరి చేసింది. పరిశ్రమకు ఇది సానుకూలమైనది. వాణిజ్యంపై ప్రభావం చూపిస్తుంది’’ అని సోమసుందరం వివరించారు.  
 

ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి
అంతర్జాతీయంగానూ పసిడికి డిమాండ్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో 9 శాతం తగ్గి 915 టన్నులుగా నమోదైంది. అమెరికాలో గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లోకి నిధుల రాక తగ్గడం, భారత్‌లో ఆభరణాలకు డిమాండ్‌ తక్కువ ఉండటం కారణాలని ప్రపంచ స్వర్ణ మండలి వివరించింది. జూలై–సెప్టెంబర్‌ కాలంలో ఆభరణాలూ వన్నె తగ్గాయి. గతేడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో 495 టన్నుల ఆభరణాలు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఇదే కాలంలో 479 టన్నుల దగ్గరే ఆగిపోయింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ బంగారంపై పెట్టుబడుల డిమాండ్‌ను తగ్గించింది. చైనా కరెన్సీ విలువ తగ్గుదల వల్ల బంగారం బార్లు, కాయిన్లకు డిమాండ్‌ మాత్రం 17 శాతం పెరిగింది. రీసైకిల్‌ అయిన బంగారం డిమాండ్‌ 6 శాతం తక్కువగా 315.4 టన్నులుగా నమోదైంది. అలాగే, బంగారం ఉత్పత్తి 2017లో మొదటి రెండు క్వార్టర్లలో (జనవరి నుంచి జూన్‌ వరకు) ఆశాజనకంగా కొనసాగగా, సెప్టెంబర్‌ క్వార్టర్‌కు వచ్చేసరికి 1 శాతం తగ్గి 841 టన్నులుగా ఉంది. చైనాలో రిటైల్‌ డిమాండ్‌ వరుసగా నాలుగో క్వార్టర్‌ (సెప్టెంబర్‌)లోనూ పుంజుకోవడం, టర్కిష్, రష్యా, కజకిస్తాన్‌ సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం, టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్లలో బంగారం వినియోగం పెరగడం ఆశాజనకం’’ అని ప్రపంచ స్వర్ణ మండలి పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement