మోత మొదలు! | GST's increased goods and services prices | Sakshi
Sakshi News home page

మోత మొదలు!

Published Sun, Jul 2 2017 3:08 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

మోత మొదలు! - Sakshi

మోత మొదలు!

జీఎస్టీతో పెరిగిన వస్తువులు, సేవల ధరలు 
పెరిగిన పన్ను తక్షణమే అమల్లోకి..
 
- బాగా పెరిగిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫోన్ల ధరలు 
యథాతథంగా నిత్యావసరాలు
పన్ను తగ్గినా వస్తువుల ధరల్లో కనిపించని మార్పు
పాత స్టాక్‌ అంతా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్న వ్యాపారులు
ఏసీ హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లుల మోత
అల్పాహారంపైనా ధరలు పెంచేసిన వైనం
బంగారం వ్యాపారంపై పెద్దగా పడని ప్రభావం
హైదరాబాద్‌ వ్యాప్తంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన
జీఎస్టీ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాని వ్యాపారులు
పలు వర్గాలకు ఆనందం.. మరికొన్ని చోట్ల నిరసనలు  
 
సాక్షి, హైదరాబాద్‌: జనంపై జీఎస్టీ మోత మొదలైంది.. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపింది. అత్యధిక శాతం పన్ను శ్లాబ్‌లలో ఉన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు, కాస్మెటిక్స్, ఫోన్ల ధరలు, వినోద రంగానికి చెందిన సేవల చార్జీలు భారీగా పెరిగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే బిల్లుల రూపంలో ఆ భారం స్పష్టంగా కనిపించింది. ఇంటింటా వినోదాన్ని పంచే టీవీ దగ్గర నుంచి దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగిన పన్ను మేరకు కొత్త ధరలను ప్రకటించాయి. మరోవైపు ధరలు తగ్గుతాయని భావించిన నిత్యావసర వస్తువులు, ఆటోమొబైల్, మందుల ధరల్లో మార్పులేమీ కనిపించలేదు. వ్యాపారులంతా పన్ను తగ్గే వస్తువులన్నింటినీ కూడా పాత ధరలకే విక్రయించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలిరోజున దాని ప్రభావం, ధరల్లో వ్య త్యాసం తెలుసుకొనేందుకు ‘సాక్షి’ శనివారం హైదరాబాద్‌ నగరం లో క్షేత్త్రస్థాయిలో పర్యటించి.. పరిశీలించింది. పలు రకాల వస్తు సేవల ధరలపై జీఎస్టీ ప్రభావం బలంగా ఉందని, మరికొన్నింటిపై అంతగా కనిపించలేదని గుర్తించింది. ఆ వివరాలివీ..
 
స్మార్ట్‌ఫోన్లు ప్రియం..
నిత్య జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్ల ధరలూ పెరిగిపోయాయి. ఉదాహరణకు శుక్రవారం వరకు సామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ (జీ615 గోల్డ్‌) ధర రూ. 15,291 ఉంటే ఇప్పుడు రూ.17,100కు చేరింది. జీఎస్టీ అమలుకు ముందు 5 శాతం వ్యాట్‌ ఉండగా.. ఇప్పుడు 7 శాతం అదనంగా 12 శాతం జీఎస్టీ విధించడమే కారణం.
 
ఎలక్ట్రానిక్‌ వస్తువులు భారం
టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్‌ మెషీన్, కూలర్లు, మైక్రోవేవ్‌ ఒవెన్‌ వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ వస్తువులపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధించారు. శుక్రవారం వరకు వీటిపై పన్ను 14.5 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదాహరణకు... సోనీ ఎల్‌ఈడీ టీవీ (32 అంగుళాలు, మోడల్‌ డబ్ల్యూ562డి) ధర శుక్రవారం 14.5 శాతం వ్యాట్‌తో రూ.37,773గా ఉండగా.. శనివారం నుంచి 28 శాతం జీఎస్టీతో రూ.42,227కు పెరిగింది. వాస్తవంగా ఈ ఎల్‌ఈడీ టీవీ ధర రూ.32,990 మాత్రమే. దీనికి స్టేట్‌ జీఎస్టీ రూ.4,618, సెంట్రల్‌ జీఎస్టీ రూ.4,618 కలుపుకొని రూ.42,227 కు విక్రయించారు.
 
విందులు, వినోదాలపై దెబ్బ!
విందులు, వినోదాలపై తొలిరోజే జీఎస్టీ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లలో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హోటల్‌లో రోటీ, బిర్యానీ కలిపి ధర రూ.1,362 కాగా.. దానిపై రూ.207 జీఎస్టీ భారం పడింది. హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం ధరలు పెరిగాయి. కాఫీ ధర రూ.32 నుంచి రూ.38 కి పెరిగింది. ఇక సినిమా టికెట్ల ధరలూ భారీగా పెరిగాయి. రూ.100 టికెట్‌కు పన్నుతో రూ.118 వసూలు చేశారు. పలు ఏసీ హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో 18 శాతం జీఎస్టీ వేయడంతో.. వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సగటున ప్రతీ లావాదేవీ మీద రూ.100 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. పలు సినిమా థియేటర్లు జీఎస్టీ పేరుతో టికెట్లపై 18 శాతం అదనంగా చార్జీలు వసూలు చేశాయి. అయితే సెకండ్, థర్డ్‌ క్లాస్‌ టికెట్లను మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు.
 
బంగారం వ్యాపారంపై పడని ప్రభావం
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలిరోజున బంగారం వ్యాపారంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. బంగారు ఆభరణాల దుకాణాలన్నీ శనివారం సందడిగానే కనిపించాయి. బంగారంపై జీఎస్టీ అమల్లోకి రాకపోవడంతో పాత ధరలతోనే విక్రయాలు కొనసాగాయి. జీఎస్టీ అమలు చేసినా అదనంగా పడే భారం ఒక శాతమేనని వ్యాపారులు చెబుతున్నారు. జీఎస్టీతో బంగారు ఆభరణాల ధరలు పెరుగుతాయన్న ఆందోళన అవసరం లేదని ఆలిండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ ట్రేడర్స్‌ సదరన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మోహన్‌లాల్‌జైన్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను కారణంగా బంగారం ధరల్లో వ్యత్యాసం పోతుందని, అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
 
యథాతథంగా నిత్యావసరాలు
బియ్యం, పప్పులు, ఉప్పు, వంటనూ నెలు, చక్కెర, గోధుమ లు, గోధుమ పిండి, తృణధాన్యాలు తదితర నిత్యావసర వస్తువులను మాత్రం పాత ధరల మేరకే విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రా బాద్‌ మోండా మార్కెట్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌ ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అన్ని రకాల నిత్యావసరాలు పాత ధరల ప్రకారమే కనిపించాయి. షాపింగ్‌ మాల్‌లు, సూపర్‌ మార్కెట్లలోనూ ధరల్లో తేడా లేదు. పాత స్టాక్‌ ఉండడంతో పాత పన్నుల ప్రకారమే విక్రయిస్తున్నట్లు కొందరు వ్యాపారులు పేర్కొన్నారు.  
 
మందులపై కనిపించని ప్రభావం
జీఎస్టీతో మధుమేహం, రక్తపోటు, కేన్సర్, టీబీ వంటి కొన్ని రకాల జబ్బులకు వినియోగించే మందుల ధరలు తగ్గనున్నట్లు పేర్కొన్నా.. శనివారం హైదరాబాద్‌లో వాటి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అన్ని చోట్లా పాత ధరల ప్రకారమే విక్రయించారు. పాత స్టాక్‌ అయిపోయే వరకు పాత ధరలే అమల్లో ఉంటాయని మెడికల్‌ షాపుల నిర్వాహకులు చెప్పడం గమనార్హం.
 
ఆటోమొబైల్‌పైనా అంతే..
జీఎస్టీతో కొన్ని వాహనాల ధరలు తగ్గి, మరికొన్నింటిపైన పెరిగే అవకాశం ఉంది. కానీ శనివారం పాత ధరల ప్రకారమే విక్రయించారు. జీఎస్టీపై మరికొంత స్పష్టత రావాల్సి ఉందని.. సోమవారం నుంచి తక్కువ సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాలు, లగ్జరీ వాహనాల ధరలు తగ్గనున్నాయని ఆటోమొబైల్‌ వర్గాలు తెలిపాయి.  
 
వినోదమూ దూరమే..
‘‘సగటు మనుషులకు అందు బాటులో ఉన్న వినోదం సినిమాయే. అటువంటి వాటిపైనా పన్నుల రూపంలో రేట్లు పెంచడం దారుణం. ఓ కుటుంబంలో నలుగురు సినిమా చూడాలనుకుంటే ఖర్చు తడిసి మోపడవుతుంది.’’ – రాజు, ముషీరాబాద్‌
 
బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో తగ్గిన రేట్లు
‘‘బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో ఆహారం మీద ఇంత కుముందు వ్యాట్‌ 14.5 శాతం, సర్వీస్‌ట్యాక్స్‌ 6 శాతం, లిక్కర్‌ మీద సర్వీస్‌ట్యాక్స్‌ 6 శాతం విధించేవారు. ఇప్పుడు కేవలం ఆహారం మీద 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో 6 శాతం రేట్లు తగ్గుతున్నాయి..’’
– నవీన్, అన్నపూర్ణ బార్‌ యజమాని
 
సామాన్యుడిపైనే భారం
‘‘జీఎస్టీతో ప్రభుత్వం, వ్యాపారస్తులు బాగానే ఉంటున్నారు. కానీ సామాన్యుడిపైనే భారం పడుతుంది. గరిష్టంగా 28 శాతం పన్నును విధించడం వలన సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయి..’’
– తుమ్మలపల్లి సత్యనారాయణ, అడ్వొకేట్‌ 
 
జీఎస్టీ పరిధిలోకి రానివి
మార్కెట్‌లో లభ్యమయ్యే 1,200 రకాల వస్తుసేవలను జీఎస్టీ పరిధిలోనికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కొన్నింటిని మాత్రం మినహాయించింది. ఈ కేటగిరీల్లో ఎంత టర్నోవర్‌ సాధించినా వారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. 
ఒక సంస్థ నియమించుకునే ఉద్యోగులకు సంబంధించి పన్ను కట్టాల్సిన పనిలేదు
కోర్టులు, ట్రిబ్యునళ్లలో అందించే సేవలపై పన్ను ఉండదు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్, గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాలకు అయ్యే ఖర్చుపై కూడా పన్ను ఉండదు.
అంత్యక్రియలు, మృతదేహాల తరలింపు, మార్చురీ సేవలకు కూడా పన్ను ఉండదు.
 
వీటన్నింటినీ విలీనం చేస్తే.. 
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టాన్ని రూపొందించడం కోసం గతంలో రాష్ట్రం పరిధిలో ఉన్న 8 చట్టాలను ప్రభుత్వం విలీనం చేసింది. వాటి వివరాలివీ..
1) తెలంగాణ విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) చట్టం – 2005
2) వినోద పన్ను చట్టం –1939
3) వాహనాల ప్రవేశ పన్ను చట్టం – 1996
4) సరుకుల ప్రవేశ పన్ను చట్టం – 2001
5) విలాస పన్ను చట్టం – 1987
6) గుర్రపు పందేలు, బెట్టింగ్‌ చట్టం – 1358 ఫసలీ   7) గ్రామీణాభివృద్ధి చట్టం – 1996
8) ప్రకటనల చట్టం
 
ఇవి చేస్తే జరిమానానే..
జీఎస్టీ చట్టం కింద డీలర్లు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా జరిమానాలు, కేసులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టంలో పేర్కొంది. ఆ ఉల్లంఘనలలో కొన్ని..
ఏదైనా వస్తువును అమ్మినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన ఇన్వాయిస్‌ లేకున్నా.. ఇన్వాయిస్‌లో తప్పులున్నా..
సరుకు సరఫరా చేయకుండా ఇన్వాయిస్‌లు తయారుచేసినా
పన్ను వసూలు చేసిన తర్వాత మూడు నెలలలోపు ఆ పన్నును ప్రభుత్వానికి చెల్లించకపోయినా
ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను అర్హత లేకుండా క్లెయిమ్‌ చేసుకున్నా
తప్పుడు అకౌంట్లు, తప్పుడు డాక్యుమెం ట్లు కలిగి ఉన్నా
రూ.20 లక్షల కన్నా ఎక్కువ వార్షిక టర్నోవర్‌ ఉండి జీఎస్టీ కింద రిజిస్టర్‌ చేసుకోకపోయినా
రిజిస్ట్రేషన్‌ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా
విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారులకు ఆటంకం కలిగించినా.. పన్ను ఎగవేత కోసం టర్నోవర్‌ను తప్పుగా చూపెట్టినా
ఒకరి రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను మరొకరు వాడుకున్నా జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెడతారు.
 
ఇంటి బడ్జెట్‌పై ప్రభావమెంత?
- జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. మనపై ఉండే ప్రభావమెంతనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. జీఎస్టీ పరోక్షపన్ను. మన దైనందిన జీవితంలో వాడే వస్తువులు, సేవల పన్నుల్లో హెచ్చుతగ్గులు... మన నెల బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. నెలకు 50 వేలు సంపాదించే కుటుంబ బడ్జెట్‌లో పెద్దగా తేడా పడదు. అలాగే రూ.80 వేలు ఆర్జించే కుటుంబంపై అదనంగా రెండు నుంచి మూడు వందల భారం పడుతుంది. మధ్యతరగతి జీవి నెల బడ్జెట్‌పై జీఎస్టీ ప్రభావం ఎంతనేది లెక్క వేసి చూస్తే....
 
జీఎస్టీ వెనుక
వస్తు, సేవల పన్ను జూలై 1 నుంచి అమల్లోకి రావడం వెనుక 12 మంది కృషి ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో బృందాన్ని మొదలుబెడితే పూర్వపు సెంట్రల్‌ బోర్డాఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఈసీ) మాజీ చైర్మన్‌ నజీబ్‌ షాతో ముగించాల్సి ఉంటుంది.             – (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
 
అరుణ్‌ జైట్లీ 
కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టడమేగాక చట్ట రూపంలోకి రావడా నికి మూడేళ్లలో చేయాల్సింది చేశారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్‌కు అరుణ్‌ తొలి చైర్మన్‌ గా వ్యవహరించారు. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతో తీసుకోవాలనే పట్టుదలతో అవసరమైతే సమావేశాలు వాయిదా వేయడానికీ వెనుకాడలేదు. 
 
వనజా ఎస్‌ సర్నా
ఏప్రిల్‌ నుంచి సీబీఈసీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఈమె జీఎస్టీని విజయవంతంగా ఆవిష్కరించి, అమలుచేసే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు.
 
ప్రకాశ్‌కుమార్‌
ఐఐటీలో విద్యనభ్యసించిన కుమార్‌కు టెక్నాల జీపై విస్తృత అవగాహన ఉన్న కారణంగా శరవేగంగా జీఎస్టీ ఆవిష్కరణకు అవసరమైన అన్ని రకాల పత్రాలు సకాలంలో సిద్ధంచేశారు.  ఆయన ఐఐటీ అనుభవం జీఎస్టీ ఆవిష్కరణలో ఎంతగానో తోడ్పడింది. 
 
శక్తికాంతదాస్‌
రెవెన్యూ, ఆర్థిక వ్యవ హారాల మాజీ కార్యదర్శిగా అందరికీ తెలిసిన దాస్‌ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఎస్టీ బాధ్యత తీసుకుని ఇది చట్టరూపం దాల్చడానికి విశేష కృషి చేశారు.  
 
నజీబ్‌ షా
జీఎస్టీ పరిశీలన దశలో ఉండగా సీబీఈసీ చైర్మన్‌గా పనిచేసిన షా  దీన్ని ప్రస్తుత స్వరూపంలోకి తీసుకురా వడానికి, అమలుకు సిద్ధమయ్యేలా చేయడానికి అవసరమైన పని పూర్తిచేశారు.  
 
హస్‌ముఖ్‌ అధియా 
కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా తెలిసిన ఈ ఐఏఎస్‌ అధికారి(గుజరాత్‌ కేడర్‌) లేకుంటే జీఎస్టీ బిల్లు పార్ల మెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో చట్టమయ్యేది కాదనేది అందరూ అంగీకరించే సత్యం. జీఎస్టీపై ఉన్న అనుమా నాలు, భయాలు తొలగించే పనిలో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, వాణి జ్య, పారిశ్రామిక మండళ్లు, ఇతర సంఘాల సమావేశాలు ఏర్పాటు చేశారు.
 
ఉపేంద్ర గుప్తా
సీబీఈసీలో పనిచేస్తూ జీఎస్టీ కమిషనర్‌గా మారిన గుప్తాకు సాంకేతిక విషయాలు కొట్టినపిండి. రెవెన్యూ సర్వీస్‌ అధికారిగా ఆయనకు ప్రతి విషయంలోనూ ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు తెలుసంటారు.
 
నవీన్‌ కుమార్‌
జీఎస్టీ నెట్‌వర్క్‌ చైర్మన్‌గా కుమార్‌ పన్ను నిర్ణ యం, ఇతర అంశాలకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పన్ను ప్రక్రియకు సంబంధించిన అనేక అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. 
 
అలాగే కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ) కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్‌ సెక్రెటరీ ఉదయ్‌సింగ్‌ కుమావత్, సీబీఈసీ పన్ను పరిశోధనా విభాగంలో జాయింట్‌ సెక్రెటరీలు ఆలోక్‌ శుక్లా, అమితాబ్‌ కుమార్‌ జీఎస్టీ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement