ఏటీఎంల ఏర్పాటు లక్ష్యం కష్టమే..
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2013-14) ముగిసేసరికి బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఏటీఎంల ఏర్పాటు కష్టసాధ్యమే! ఒక్కో బ్రాంచీకి కనీసం ఒక్కో ఏటీఎం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ 2014 మార్చి 31కల్లా ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు మొత్తం 72,340 ఏటీఎంలను కలిగి ఉండాలి. కానీ 2013 మార్చి చివరికి ఏటీఎంల సంఖ్య 37,672గా నమోదుకావడంతో వీటిని దాదాపు రెట్టింపు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు అనుగుణంగా 2013-14 బడ్జెట్‌లో 34,668 ఏటీఎంలను కొత్తగా ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే డిసెంబర్ ముగిసేసరికి పీఎస్‌యూ బ్యాంకులు 14,885 ఏటీఎంలను మాత్రమే కొత్తగా నెలకొల్పగలిగాయి. అంటే తొలి 9 నెలల లక్ష్యమైన 25,950 ఏటీఎంలలో ముప్పావువంతును మాత్రమే అందుకోగలిగాయి. వెరసి చివరి 3 నెలల్లో మరో 19,813 ఏటీఎంలను ఏ ర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎస్‌బీఐ వెనకడుగు: ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ డిసెంబర్‌కల్లా 2,266 ఏటీఎంలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేయడంతో, మార్చి ముగిసేసరికి మరో 2,221 ఏటీఎంలను నెలకొల్పాల్సిన పరిస్థితి. కాగా, లక్ష్యానికి అనుగుణంగా ఏటీఎంల ఏర్పాటు విషయంలో బీవోబీ, ఐడీబీఐ, విజ యా బ్యాంక్ బాగా ముందు నిలవడం విశేషం! బీవోబీ 2, ఐడీబీఐ 32, విజయా బ్యాంక్ 39 ఏటీఎంలను మాత్రమే కొత్తగా నెలకొల్పాల్సి ఉంది. ప్రభుత్వ రంగంలో మొత్తం 26 బ్యాంకులు ఉన్నాయి.