
క్షీణిస్తున్న డెరైక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత నాలుగేళ్లుగా దేశీయ డెరైక్ట్ సెల్లింగ్ మార్కెట్ వ్యాపార వృద్ధి క్రమేపీ క్షీణిస్తోంది. 2010-11లో 27 శాతం వృద్ధి ఉంటే అది 2013-14కి 4.3 శాతానికి పడిపోయింది. 2012-13లో రూ. 7,164 కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం గతేడాది స్వల్ప వృద్ధితో రూ. 7,472 కోట్లకు పరిమితమయ్యింది. డెరైక్ట్ సెల్లింగ్‌కు సంబంధించి నియంత్రణ వ్యవస్థపై సరైన స్పష్టత లేకపోవడమే వృద్ధిరేటు తగ్గడానికి ప్రధాన కారణంగా ఇండియన్ డెరైక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్‌ఏ) పేర్కొంది. దేశీయ డెరైక్ట్ సెల్లింగ్ మార్కెట్‌పై పీహెచ్‌డీ చాంబర్ నిర్వహించిన సర్వే వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐడీఎస్‌ఏ సెక్రటరీ జనరల్ చావి హేమంత్ మాట్లాడుతూ ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో 13 శాతం క్షీణత నమోదయ్యిందన్నారు.
ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పోలీస్ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ఈ రాష్ట్రాల ప్రజలు వ్యాపారంపై అంతగా ఆసక్తి చూపించడం లేదన్నారు. దీంతో 2013తో ఆరో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయిందన్నారు.ఈ ఏడాది వ్యాపార పరిమాణం రూ. 10,000 కోట్లకు చేరుతుందని తొలుత అంచనా వేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీహెచ్‌డీ చాంబర్ చీఫ్ ఎకనామిస్ట్ ఎస్.పి శర్మ మాట్లాడుతూ 2020 నాటికీ ఈ వ్యాపారం రూ. 23, 742 కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. మారిన పరిస్థితుల్లో గత అంచనా లక్ష్యం రూ. 34,000 కోట్లను తగ్గించినట్లు తెలిపారు.