మా ఫోన్లు వాడకండి.. స్విచాఫ్ చేసేయండి
ఎవరైనా సరే సాధారణంగా తమ ఫోన్లు అద్భుతంగా పనిచేస్తాయని, వాటినే వాడాలని వినియోగదారులను ఊదరగొడుతుంటారు. కానీ, శాంసంగ్ కంపెనీ మాత్రం తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసేయాలని చెబుతోంది. ''వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి. కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది.
దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది. అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ పరిశోధనలలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయడం ఇది రెండోసారి. యాపిల్ ఐఫోన్‌కు దీటుగా ఉండేలా ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసింది. దానికి ప్రీబుకింగ్స్ భారీగా ఉండటంతో తొలుత సరఫరా చేయలేనంత పరిస్థితి ఏర్పడింఇ. కానీ, అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే సోషల్ మీడియాలో ఇందులోని సమస్యల గురించి బాగా ప్రచారం జరిగింది.
బ్యాటరీలలో సమస్యలు ఉన్నాయని దాదాపు 25 లక్షల ఫోన్లను వెనక్కి తీసుకుని, వాటి బ్యాటరీలు మార్చి మళ్లీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా సమస్య అలాగే ఉండటంతో ఇక ప్రస్తుతానికి ఆ ఫోన్ వాడకం ఆపేయమనడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా పోయింది.