దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం! | Domestic stock markets are rising | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం!

Published Sun, May 28 2017 11:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం! - Sakshi

దీర్ఘకాలానికి ఈక్విటీలే దివ్యౌషధం!

దేశీ స్టాక్‌మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టాలను దాటేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వడ్డీ రేట్లు చూస్తే ఇవి మరికొన్నాళ్లు తక్కువ స్థాయిల్లోనే కొనసాగవచ్చు. వేల్యుయేషన్స్‌ ధోరణులను, మార్కెట్ల దిశను అంచనా వేయడానికి కీలకమైన ఈ రెండింటి తీరు తెన్నులను బట్టి చూస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఈక్విటీలు ఆశావహంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక గణనీయంగా పెరిగినప్పటికీ.. వేల్యుయేషన్‌ దృష్టికోణం నుంచి దీర్ఘకాలిక సగటు ప్రాతిపదికన చూస్తే సూచీల్లోని లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ మరీ ఖరీదైనవిగా ఏమీ లేవు. వడ్డీరేట్లు మరి కొంత కాలం తక్కువ స్థాయిలోనే ఉండనున్న నేపథ్యంలో సహేతుకమైన వేల్యుయేషన్స్‌ గల లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కరెక్షన్స్‌ చోటు చేసుకోవచ్చు గానీ.. స్థూలంగా చూస్తే మాత్రం రిస్కుకు తగిన రివార్డులివ్వడంలో ఈక్విటీలే ఆశావహంగా కనిపిస్తున్నాయి.

స్మాల్‌ క్యాప్‌ జోరు తగ్గుముఖం..
దేశీయంగా పెట్టుబడులు ఈక్విటీల్లోకి రావాలంటే మార్కెట్లు బాగుండాలి. స్టాక్‌మార్కెట్లలోకి దేశీ పెట్టుబడులు పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ గడిచిన కొన్నాళ్లుగా చూస్తే.. ఈ పెట్టుబడుల్లో అధిక భాగం మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లోకి వచ్చాయి. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లోకి అంతగా రాలేదు. లార్జ్‌ క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు రాణిస్తుంటేనే మార్కెట్లపై దేశీయంగా సామాన్య ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉంటారు. మధ్య, చిన్న స్థాయి షేర్ల వేల్యుయేషన్లు ఇప్పటికే గణనీయంగా పెరిగాయి. దీంతో మరికొన్నాళ్ల పాటు ఈ పరుగు పునరావృతం కాకపోవచ్చు. రేప్పొద్దున మరింత భారీగా ఎదిగే సత్తా ఉన్న చిన్న సంస్థలను నిరంతరాయంగా దొరకపుచ్చుకోవడం చాలా కష్టమైన వ్యవహారమే. మంచి ట్రాక్‌ రికార్డు, లాభదాయకత, ఉత్తమమైన కార్పొరేట్‌ విధానాలు, వ్యాపారం తీరుతెన్నులు బాగున్న సంస్థలు స్వల్పకాలంలో లార్జ్‌ క్యాప్‌లుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి.

ఈ రంగాలు ఆసక్తికరం..
రాబోయే రోజుల్లో రంగాలవారీగా చూస్తే.. ఫార్మా మెరుగ్గానే ఉండొచ్చని అంచనా. ఎఫ్‌డీఏ అంశాలు ప్రస్తుతం చికాకుపెడుతున్నప్పటికీ.. అవి మరింత కాలం కొనసాగకపోవచ్చు. ఫార్మా కొన్నాళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ.. మెల్లగా అంతా చక్కబడగలదు. ఫైనాన్షియల్‌ సర్వీసుల రంగం కూడా కొన్నాళ్లుగా స్థిరంగా మెరుగైన పనితీరు కనపరుస్తోంది. అలాగే ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ కంపెనీలు సైతం ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు చిన్న రంగాలకు సంబంధించి టెక్స్‌టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆగ్రో కమోడిటీ స్టాక్స్‌ కూడా రాబోయే రోజుల్లో మెరుగ్గా రాణించవచ్చు.

విస్తృతమైన ర్యాలీ...
వర్ధమాన మార్కెట్లలోకి మళ్లీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుండటంతో సూచీలు ర్యాలీ చేస్తున్నాయి. క్రమంగా కొన్ని రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం పరిమితమైనా.. మొత్తం మీద మాత్రం విçస్తృ తంగా అన్ని రంగాల షేర్లలోనూ ర్యాలీ కనిపించవచ్చు. అంతర్జాతీయ పరిణామాలకు తగినట్లుగా ఒకో సందర్భంలో ఒక్కో రంగం హైలైట్‌ కావొచ్చు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో ఉండటంతో పాటు మెరుగైన ఆర్థిక ఫలితాలతో అన్నింటి వేల్యుయేషన్స్‌ పెరగొచ్చు. వాటికుండే వెయిటేజీని బట్టి తదనుగుణంగా సూచీలు సైతం పెరిగే అవకాశముంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement