గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. కరోనా కారణంగా భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్లు తిరిగి ఏడాదిలోపే రెట్టింపునకు పైగా పెరిగి రికార్డులు సృష్టించాయి. ఈ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్థిరమైన రాబడులను అందించిన పథకాలు ఏవని పరిశీలిస్తే కేవలం కొన్నే పథకలు కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. కరోనా కారణంగా కుదేలైన మన దేశ ఆర్థిక వ్యవస్థ.. వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత తిరిగి అంతే వేగంగా కోలుకుంటుందని నిపుణుల అంచనా.
ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపించడం అన్నది ఈక్విటీ మార్కెట్లకు అనుకూలైన మైన విషయమే. దీంతో ఈక్విటీలు వచ్చే 2–3 ఏళ్లపాటు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి. చారిత్రకంగా చూస్తే స్వల్ప కాలంలోనే ఈ అస్థితరలు ఉంటాయేమో కానీ.. దీర్ఘకాలంలో (కనీసం పదేళ్లు ఆ పైన) ఈక్విటీలు మంచి రాబడులను ఇస్తాయని ఎన్నో ఆధారాలున్నాయి. కనుక ఇన్వెస్టర్లు మెరుగైన రాబడుల కోసం.. అదే సమయంలో పెట్టుబడులకు సంబంధించి పరిమిత రిస్క్ తీసుకునే వారు నాణ్యమైన లార్జ్‌క్యాప్ (మార్కెట్ విలువ పరంగా టాప్–100) పథకాలను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది.
ఒకవేళ మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లార్జ్‌క్యాప్ కంపెనీలు సమర్థవంతంగా అధిగమించగలవు. కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం మంచి రాబడుల చరిత్ర కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో నమ్మకమైన పనితీరు చూపిస్తున్న వాటిల్లో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి.
రాబడులు
ఏ కాల వ్యవధికి పరిశీలించినా కానీ యాక్సిస్ లార్జ్‌క్యాప్ ఫండ్ రాబడులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. లార్జ్‌క్యాప్ విభాగంలో యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ అగ్రగామిగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 44 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 15 శాతం, ఐదేళ్ల కాలంలో 16 శాతం చొప్పున ఉన్నాయి. ఏడేళ్లలోనూ వార్షికంగా 14 శాతం రాబడినిచ్చింది. పదేళ్ల కాలంలో వార్షిక రాబడి 14 శాతం చొప్పున ఉంది.
కనుక ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాల కోసం సిప్ రూపంలో ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఏడాది కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాల వ్యవధుల్లోనూ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50 కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఈ పథకం నిర్వహణలో జూన్ చివరికి రూ.28,233 కోట్ల ఇన్వెస్టర్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే (2010 జనవరి) వార్షిక రాబడి 13.35 శాతం చొప్పున ఉంది.
పెట్టుబడుల విధానం
లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక తన పెట్టుబడుల్లో కనీసం 80 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని చిన్న కంపెనీలకు కేటాయిస్తుంది. కానీ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ పథకం దాదాపు పెట్టుబడులన్నింటినీ లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడం గమనార్హం. మెగా, లార్జ్ క్యాప్ కంపెనీల్లోనే 99 శాతం ఇన్వెస్ట్ చేయగా.. ఒక శాతాన్ని స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది.
ప్రస్తుతం ఈ పథకం తన వద్దనున్న పెట్టుబడుల్లో 95.5 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించి, మిగిలిన 4.5 శాతాన్ని డెట్ సాధనాల్లో పెట్టి ఉంది. అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు దిద్దుబాటుకు లోనైతే మంచి పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకునేందుకు గాను ఈ మేరకు డెట్ హోల్డింగ్స్‌ను కలిగి ఉందని భావించొచ్చు. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 36 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లోనే 37 శాతం వరకు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 18 శాతం ఇన్వెస్ట్ చేసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment