ఒడిదుడుకులు ఉండొచ్చు..! | Stock experts opinion on the market movement this week | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకులు ఉండొచ్చు..!

Published Mon, Aug 23 2021 5:43 AM | Last Updated on Mon, Aug 23 2021 5:43 AM

Stock experts opinion on the market movement this week - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ గురువారం(ఈ నెల 26న) ఆగస్టు సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగుస్తుండటం ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. దేశీయంగా ఈక్విటీ మార్కెట్‌ను ప్రభావితం చేసే వార్తలేవీ లేకపోవడంతో మన స్టాక్‌ సూచీలకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దిశానిర్దేశం చేస్తాయని అంటున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ ట్యాపరింగ్, డెల్టా వేరియంట్‌ కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి తీవ్రత అంశాలూ సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. నాలుగురోజులే ట్రేడింగ్‌ జరిగిన గతవారంలో సూచీలు రెండురోజులు లాభాల్ని ఆర్జించి, మరో రెండురోజులు నష్టాలను చవిచూశాయి. విస్తతృస్థాయి మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో వారం మొత్తంగా సెన్సెక్స్‌ 108 పాయింట్లు,నిఫ్టీ 78పాయింట్లను కోల్పోయాయి.

మూడు లిస్టింగ్‌లు..,
ప్రాథమిక, సెకండరీ మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో మూడు లిస్టింగ్‌లతో పాటు నిధుల సమీకరణకు మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైంది. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకున్న విస్టాస్‌ షేర్లు నేడు (సోమవారం).., కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్, అప్టాస్‌ షేర్లు మంగవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌కానున్నాయి. ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరతతో గ్రే మార్కెట్లో ఈ కంపెనీల షేర్ల ధరలు దిగివచ్చాయి. స్వల్ప ప్రీమియం ధరతో లిస్ట్‌కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఐపీఓకు అమి ఆర్గానిక్స్‌...
ప్రత్యేక రసాయన, ఏపీఐ మానుఫ్యాక్చరర్‌ అమి ఆర్గానిక్స్‌ కంపెనీ ఇదే వారంలో పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఓ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.300 కోట్ల తాజా విలువైన షేర్లను జారీ చేయనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతి ద్వారా ప్రమోటర్లు 60లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెట్టారు.

గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు...
ఈ గురువారం(ఈ నెల 26న) నిఫ్టీ సూచీకి చెందిన ఆగస్టు సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్‌ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తన పొజిషన్లను స్క్వేయర్‌ ఆఫ్‌కు ఆసక్తి చూపుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు.

విదేశీ పెట్టుబడుల జోరు...
మన క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)జోరు కొనసాగుతోంది. ఈ ఆగస్ట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లో ఇప్పటిదాకా(ఆగస్ట్‌ 1–23 తేదీల మధ్య) రూ.7,245 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.5,001 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.2,244 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ వైస్‌ చైర్మన్‌ వీకే విజయకుమార్‌ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement