
సెప్టెంబర్ 29 నుంచి స్పెక్ట్రమ్ వేలం..
దేశ చరిత్రలో అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 29 నుంచి వేలం ప్రారంభం కానుంది.
♦ దరఖాస్తులకు ఆహ్వానం పలికిన టెలికం శాఖ
♦ విక్రయానికి 2,354 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్
♦ ఊపందుకోనున్న 4జీ సేవలు
♦ 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో తొలిసారిగా వేలం
♦ రూ.5.63 లక్షల కోట్లు వస్తాయని అంచనా
న్యూఢిల్లీ : దేశ చరిత్రలో అతిపెద్ద స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 29 నుంచి వేలం ప్రారంభం కానుంది. వేలంలో భాగంగా కేంద్రం రూ.5.63 లక్షల కోట్ల ప్రాథమిక విలువతో స్పెక్ట్రమ్‌ను విక్రయానికి పెడుతోంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన (ఎన్‌ఐఏ) విడుదల చేసింది. పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నామని, ఫ్రాగ్మంటేషన్, సేవల్లో నాణ్యత తదితర సమస్యలకు ఇది పరిష్కారం చూపుతుందని టెలికం శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ ప్రకటన విడుదల సందర్భంగా చెప్పారు.
కాగా, ప్రభుత్వం 700 మెగాహెడ్జ్ బ్యాండ్‌లో తొలిసారిగా వాయు తరంగాలను వేలానికి ఉంచనుంది. ఒక్క ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారానే రూ.4 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. దరఖాస్తుల ప్రక్రియపై సందేహాలు, విచారణలకు గాను టెలికం శాఖ ఈ నెల 13న సమావేశం నిర్వహించనుంది.
బిడ్డింగ్ విశేషాలు...
⇔ 2,354.55 మెగాహెడ్జ్‌ల వాయు తరంగాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ తరంగాలు 700 మెగాహెడ్జ్, 800, 900, 1,800, 2,100, 2,300, 2,500 మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో ఉంటాయి.
⇔ వేలానికి ఉంచే మొబైల్ రేడియో వాయు తరంగాలు అన్నీ కూడా అధిక వేగంతో కూడిన 4జీ సర్వీసులకు అనుకూలించేవి.
⇔ ఈ వేలం ద్వారా రూ.64వేల కోట్లు, వివిధ రకాల పన్నుల ద్వారా రూ.98,995 కోట్ల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
⇔ 700, 800, 900 మెగాహెడ్జ్ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ గెలుచుకున్న కంపెనీలు బిడ్ మొత్తంలో కనీసం 25 శాతాన్ని వేలం ముగిసిన 10 రోజుల్లోపు కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల విరామం తర్వాత మిగిలిన మొత్తాన్ని 10 వార్షిక వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ విజేతలు బిడ్ మొత్తంలో 50 శాతాన్ని వెంటనే చెల్లించాల్సి ఉంటుంది.
⇔ టెలికం కంపెనీల అభ్యర్థన మేరకు కేంద్రం వాయిదా చెల్లింపులపై వడ్డీని 10 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గించింది.
వేలం ప్రక్రియ
ఆగస్ట్ 13: దరఖాస్తుల ప్రక్రియపై సమావేశం
ఆగస్ట్ 29: వేలంపై సందేహాలను తీరుస్తూ వివరణ
సెప్టెంబర్ 13: దరఖాస్తుల సమర్పణకు గడువు.
కంపెనీలకు ఇదో అవకాశం
భారీ స్పెక్ట్రమ్ వేలం కావడం, నిబంధనలను అనుకూలంగా మార్చడంతో బిడ్డర్ల నుంచి అనూహ్య స్పందన రానుంది. గతంలో నిర్వహించిన ఏ వేలం ప్రక్రియలోనూ ఇంత భారీ పరిమాణంలో స్పెక్ట్రమ్‌ను వేలానికి ఉంచలేదు. వేలంలో పాల్గొని అధిక మొత్తంలో స్పెక్ట్రమ్‌ను గెలుచుకోవడంతో అంతర్జాతీయ స్థాయి నాణ్యత సేవలను అందించే అవకాశం లభిస్తుంది.
- జేఎస్ దీపక్, టెలికం శాఖ కార్యదర్శి