కలల సాకారానికి 'సిప్ టాపప్' | dreams of 'sip tapap' | Sakshi
Sakshi News home page

కలల సాకారానికి 'సిప్ టాపప్'

Published Mon, Sep 19 2016 6:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

కలల సాకారానికి 'సిప్ టాపప్'

కలల సాకారానికి 'సిప్ టాపప్'

పెంచుకుంటూ వెళితే అనూహ్య రాబడి
అఖిల్‌కు ఈ మధ్యే పెళ్లయింది. త్వరగా సొంతింటి యజమాని కావాలనే కోరిక ఉంది. రెండేళ్లలో కార్లో తిరిగేయాలనే కల కూడా కళ్ల ముందు కదులుతోంది. మున్ముందు పుట్టబోయే పిల్లలకయ్యే ఖర్చు, వారి విద్యావసరాలను తట్టుకునేలా పొదుపు చేయాలని కూడా ఉంది. నిజానికి అఖిల్‌కే కాదు!! ప్రతి వ్యక్తికీ కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా కొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. ఈ లక్ష్యాలను ఎక్స్‌ప్రెస్ వేగంతో చేరుకోవాలంటే ‘టాపప్’ తల్లి గురించి తెలుసుకుని తీరాలి... కలలు, లక్ష్యాలు త్వరగా సాకారం కావాలంటే అందుకు తగ్గ కృషి చేయాల్సి ఉంటుంది.

సాధారణంగా ఇటువంటి కోర్కెల జాబితా అందరికీ ఉంటుంది.
కానీ, ఎంతమంది వీటిని నెరవేర్చుకుంటున్నారు? అని అడిగితే చాలా తక్కువ మందేనన్న సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణాలను అన్వేషిస్తే... వారు లక్ష్యాన్ని తగిన విధంగా నిర్దేశించుకోలేకపోవడం, అందుకు తగ్గట్టుగా మదుపు చేయకపోవడమే అయి ఉంటుంది.

 
సాగిపోవాల్సిన మార్గమిదే

వార్షికాదాయం రూ.10 లక్షలు. సాధారణంగా దీనికి పది రెట్ల వరకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. అంటే రూ.కోటి సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఈ కోటి రూపాయలను పదేళ్ల కాలంలో 120 నెలల్లో చేరుకునేలా ప్లాన్ చేసుకుని ఆ మేరకు క్రమానుగత పెట్టుబడి (సిప్) పెడుతూ వెళ్లాలి. పొదుపు, మదుపులకు సిప్ ఉత్తమ సాధనం అని వినే ఉంటారు. పెట్టుకున్న లక్ష్యాలను వేగవంతంగా  చేరుకోవాలంటే సిప్‌కు సిప్ టాపప్‌ను తగిలించుకోవడమే ఉత్తమం. అంటే సిప్ మొత్తానికి అదనంగా టాపప్ రూపంలో మరికొంత మదుపు చేసుకుంటూ వెళ్లాలి. దీన్నే దగ్గరిదారి అని చెప్పవచ్చు.
 
టాపప్ ఎలా..?
ప్రతీ ఆరు నెలలు లేదా ఏడాదికోసారి, లేదా మీ వెసులుబాటు ఆధారంగా సిప్ టాపప్ ఎంచుకోవచ్చు. కనీసం రూ.500 నుంచి గరిష్టంగా మీ వెసులుబాటు వరకు. ఏటా వేతనం ఎంతోకొంత పెరుగుతూనే ఉంటుంది కనుక 10 శాతం చొప్పున సిప్ టాపప్ పెరిగేలా చూసుకుంటే సరిపోతుంది. సిప్ టాపప్ అన్నది పెట్టుబడి దారులు తమ లక్ష్యాలను తొందరగా చేరుకునేందుకు ఉకపరించే ఉత్తమ సాధనం.
 
మహిమ ఇదీ...

సిప్ టాపప్ కొద్ది మొత్తమే కావచ్చు. కానీ పెట్టుబడుల విలువను గణనీయంగా పెంచడంలో దీనికిదే సాటి. ఉదాహరణకు అఖిల్ లక్ష్యం రూ.5వేల చొప్పున సిప్ రూపంలో మదుపు చేయడం. కాల వ్యవధి పదేళ్లు. ఏటా 12 శాతం చొప్పున రాబడి (నెలవారీ కాంపౌండెడ్) ఉంటే పదేళ్ల తర్వాత పెట్టుబడుల విలువ రూ.11,79,275. కానీ, సిప్ టాపప్ రూపంలో ఏటా ఓ పది శాతం చొప్పున అదనంగా అఖిల్ పొదుపు చేయాలని నిర్ణయించుకుంటే పదేళ్ల తర్వాత సమకూరే మొత్తం రూ.17,20,659. ఎంతలో ఎంత తేడా చూశారా...? కేవలం పది శాతం అదనంగా టాపప్ రూపంలో యాడ్ చేసుకుంటూ వెళ్లడం వల్ల రూ.5,41,384 రూపాయల నిధి అదనంగా సమకూరింది. దీన్ని చూస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు దగ్గరి దారి సిప్ టాపప్ అని అర్థమయ్యే ఉంటుంది.

ఉదాహరణకు నెలకు రూ.5,098 రూపాయలను సిప్ చేస్తూ, ఏటా పది శాతం చొప్పున పెట్టుబడి పెరిగేలా సిప్ టాపప్ ఎంపిక చేసుకుంటే... 12 శాతం రాబడి చొప్పున 20 ఏళ్ల కాలంలో రూ.కోటి నిధిని సమకూరుతుంది. రూ.3 కోట్లు కావాలనుకుంటే ప్రతి నెలా రూ.15,295 చొప్పున సిప్ చేస్తూ ఏటా 10 శాతం పెరిగేలా సిప్ టాపప్ ఎంచుకుంటే సరి. నెలకు కేవలం రూ.5వేల చొప్పున పెట్టుబడికే పరిమితం అయితే రూ.3.13 కోట్ల నిధి కోసం 35 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
 
టాపప్ ఎప్పుడు...?
ఏటా టాపప్ పెంచుకోవడం ఎప్పుడన్న సందేహం వస్తే... వేతనం పెరిగి చేతికి అందే సమయమే అనువైనదని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ మందికి పెరిగిన వేతనం ఏప్రిల్ నెలలో చేతికి అందుతుంది. అంటే ఏటా ఏప్రిల్‌లో సిప్ టాపప్‌ను నిర్ణయించుకుంటే... ఆ మేరకు బ్యాంకు నుంచి అదనంగా మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెళుతుంది. లేదు వెసులుబాటు ఉందనుకుంటే ఆరు నెలలకోసారి కూడా సిప్ టాపప్ పెంచుకోవచ్చు. సిప్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే టాపప్ సిప్‌కు సంబంధించి స్టాండర్డ్ ఇన్‌స్ట్రక్షన్ సమర్పిస్తే సరిపోతుంది. ఏటా రూ.2 వేలు లేదా అప్పటికే ఉన్న సిప్ మొత్తంపై పది శాతం చొప్పున పెరిగే ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
 
లాభాలు
సిప్ టాపప్ అనేది పెట్టుబడి దారుల కోర్టులో ఉన్న బాల్ తో సమానం, మీరు డిసైడ్ చేసినట్టు అది వెళుతుంది. దీని సాయంతో స్వల్ప కాల, దీర్ఘకాల లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు.
ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి రాబడులు అందుకోవాలంటే ఏటా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను పెంచుకోవాలి. అందుకు సిప్ టాపప్ ఓ సాధనం.
ఏటా వేతనం పెరుగుతూనే ఉంటుంది. కానీ, అందుకు తగ్గట్టు పొదుపు, మదుపులు పెరుగుతున్నాయా..? చాలా మంది అవును అని చెప్పలేని స్థితి. సిప్ టాపప్ పత్రంపై ఒక్కసారి సంతకం పెడితే పెరిగే వేతనానికి తగ్గట్టు అదే పొదుపు చేసుకుంటూ వెళుతుంది.
మీ ఆదాయ పెరుగుదల, బోనస్, ఇతరత్రా లభించే ప్రయోజనాలకు తగ్గట్టు, మీ వెసులుబాటుకు అనుగుణంగానే టాపప్ నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement