
మాల్యాకు మరో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. సీబీఐ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు పెట్టింది. త్వరలోనే మాల్యాను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ముంబైకు చెందిన ఐడీబీఐ బ్యాంకు అధికారులపైనా ఈడీ కేసు నమోదు చేసింది.
మాల్యా, ఐడీబీఐ అధికారులు కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.900 కోట్లు నష్టం కలిగించడానికి కారణమయ్యారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. నెగెటివ్ క్రిడిట్ రేటింగ్స్, ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా కింగ్‌ఫిషర్ కు ఐడీబీఐ రుణాలిచ్చిందని ఆరోపించింది. దర్యాప్తులో భాగంగా 2015 అక్టోబర్ లో సీబీఐ అధికారులు ముంబై, బెంగళూరు, గోవాలోని మాల్యా నివాసాల్లో సోదాలు జరిపారు.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2012 అక్టోబర్ నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. కాగా, తానెక్కడికి పారిపోలేదని, రుణ ఎగవేతదారును కాదని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.