విదేశీ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 554 పాయింట్లు జంప్‌చేసి 32,160ను తాకగా.. నిఫ్టీ 156 పాయింట్లు ఎగసి 9,471 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ దిగ్గజం యూఫ్లెక్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..
ఐషర్ మోటార్స్
చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటు, లిక్విడిటీ పెంపునకు వీలుగా షేరు ముఖ విలువను విభజించే యోచనలో ఉన్నట్లు ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ ఐషర్ బ్రాండుతో వాణిజ్య వాహనాలు, బస్సులపాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ మోటార్ సైకిళ్లను సైతం రూపొందించే సంగతి తెలిసిందే. కాగా.. రూ. 10 ముఖ విలువగల షేరు విభజన ప్రతిపాదనపై జూన్ 12న నిర్వహించనున్న కంపెనీ బోర్డు సమావేశంలో నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సర(2019-20) చివరి త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐషర్ మోటార్స్ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 16,320 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 16,430 వరకూ ఎగసింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లో ఈ కౌంటర్ 12 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహన విక్రయాలు 17 శాతం క్షీణించి 1.63 లక్షలకు పరిమితమైనట్లు తెలుస్తోంది.
యూఫ్లెక్స్ లిమిటెడ్
ఫ్లెక్స్ ప్రొటెక్ట్ పేరుతో వ్యక్తిగత రక్షణ కల్పించగల కవరాల్ ప్రొడక్టును రూపొందించినట్లు ప్యాకేజింగ్ సొల్యూషన్ల కంపెనీ యూఫ్లెక్స్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఐఐటీ, ఐఎన్‌ఎంఏఎస్, డీఆర్‌డీవో ఢిల్లీతో కలసి సంయుక్తంగా ఈ ప్రొడక్టును అభివృద్ఢి చేసినట్లు తెలియజేసింది. నాలుగు లేయర్ల రక్షణతోపాటు.. యాంటీమైక్రోబయల్ కోటింగ్‌తో ఫ్లెక్స్ ప్రొటెక్ట్‌ను తయారు చేసినట్లు వివరించింది. ఈ ప్రొడక్టుకు డీఆర్‌డీవో అనుమతి లభించినట్లు తెలియజేసింది. కోవిడ్-19 సోకినవారికి వైద్య సేవలు అందించే ఆరోగ్య కార్యకర్తలకు ఈ ప్రొడక్ట్ ప్రయోజనకరంగా నిలుస్తుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యూఫ్లెక్స్ షేరు 8.5 శాతం జంప్‌చేసి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 204 వరకూ ఎగసింది. ఈ ప్రొడక్టును కెమిస్టులు, ఈకామర్స్ ద్వారా విక్రయించే సన్నాహాలు చేస్తున్నట్లు యూఫ్లెక్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment