ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలు..
ప్రభుత్వాలతో చర్చిస్తున్నాం..
మహీంద్రా రేవా సీఈవో అరవింద్
హైదరాబాద్ మార్కెట్లో ఈ2ఓ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం మహీంద్రా రేవా అమ్మకాలను గణనీయంగా పెంచుకునే దిశగా కసరత్తు చేస్తోంది. మహీంద్రా ఈ2ఓ కారును విక్రయిస్తున్న ఈ సంస్థ.. మ్యాక్సిమో, వెరిటో సెడాన్ మోడళ్లను సైతం ఎలక్ట్రిక్ వర్షన్‌లో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద అగ్రా కారిడార్‌లో మ్యాక్సిమో వాహనాలు పరుగెడుతున్నాయి. వాణిజ్యకార్యకలాపాలకోసం ఈ రెండు మోడళ్లను ఆవిష్కరించాల్సి ఉందని మహీంద్రా రేవా సీఈవో అరవింద్ మాథ్యూ చెప్పారు.
మహీంద్రా ఈ2ఓ కారును హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా సేల్స్ హెడ్ జగన్ కురియన్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ప్రభుత్వాలతో ప్రత్యేకించి ప్రజా రవాణా సంస్థలు, పర్యాటక శాఖలతో చర్చిస్తున్నట్టు చెప్పారు.
నిధులు ఖర్చు చేస్తేనే..: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల విస్త్రృతి, తయారీకి భారత ప్రభుత్వం ఫేమ్ ప్రాజెక్టును చేపట్టింది. దీని కోసం ఏప్రిల్ 2015-మార్చి 2017 కాలానికి రూ.795 కోట్లు కేటాయించింది. దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనానికి ద్విచక్ర వాహనం మొదలు బస్‌ల వరకు రూ.1,800 నుంచి రూ.66 లక్షల వరకు కేంద్రం భరిస్తుంది. అయితే ఫేమ్ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తేనే ఆశించిన ఫలితాలు నమోదు చేయవచ్చని అరవింద్ మాథ్యూ వెల్లడించారు. చార్జింగ్ స్టేషన్లు విరివిగా ఏర్పాటు కావాలన్నారు.