రెండేళ్ల అంతంత మాత్రం అమ్మకాల నుంచి ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ వంటి వినియోగదారుల ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు గత ఏడాది కోలుకున్నాయి. గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ జోష్‌తో ఈ ఏడాది అమ్మకాలు మరింత మెరుగ్గా ఉండగలవన్న ఆశలను కోవిడ్–19(కరోనా) వైరస్ కాటేసింది. పన్నులు పెరగడం, సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, డిమాండ్ కుదేలవ్వడం, అమ్మకాలు తగ్గుతున్నా ధరలు పెంచక తప్పని విచిత్ర పరిస్థితుల్లో తయారీదారులు చి క్కుకోవడం.... ఇలా చాలా కారణాలు కన్సూమర్ డ్యూరబుల్ కంపెనీల అదృష్టాన్ని అదృశ్యం చేయనున్నాయి. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఈ కంపెనీల భవిష్యత్తు అనిశ్చితిగా మారిపోయింది. వివరాలు... (కేసులు 5 లక్షలు.. మృతులు 22 వేలు)
అమ్మకాలు అంతంతమాత్రమే....!
కరోనా ప్రభావంతో ఏసీ, ఫ్రిజ్ వంటి పెద్ద గృహోపకరణాలకు డిమాండ్ తగ్గుతోంది. సాధారణంగా ఫిబ్రవరిలో కేరళలో మండే ఎండలు మొదలవుతాయి. దీంతోనే భారత్‌లో కూడా ఎండాకాలం మొదలవుతుంది. ఏసీ, ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా ఇప్పటి నుంచే మొదలవుతాయి. కానీ, మార్చి నెల మరో నాలుగు రోజుల్లో ముగియనున్నప్పటికీ, కేరళలో డిమాండ్ పెరగకపోగా, అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండటం... కరోనా కల్లోలం ఏ స్థాయిలో ఉందో సూచిస్తోంది. ఏడాది ఏసీ అమ్మకాల్లో సగం వరకూ ఫిబ్రవరి– జూలై మధ్యనే జరుగుతాయి. కానీ ఈ ఏడాది మార్చి నెల దాదాపు ముగింపుకు వచ్చినా, ఏసీ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాల్లో అసలు అమ్మకాలు పుంజుకోనేలేదు. వచ్చే నెల 14 దాకా దేశమంతా లాక్‌డౌన్ ఉండనుండటంతో అమ్మకాలపై కంపెనీలు ఆశలు వదిలేసుకున్నాయి. (కరోనా నివారణకు రూ.1500 లక్షల కోట్లు)
కోవిడ్–19 వైరస్ ప్రభావం తీవ్రంగానే...
సరఫరా చెయిన్‌లో ఎలాంటి సమస్యలు లేకపోయినా, కోవిడ్–19 వైరస్ ప్రభావం సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ఉండగలదని దైకిన్ ఇండి యా ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్లాంట్లన్నీ చైనాలో కాకుండా ఇండోనేషియాలో ఉన్నాయని, అందుకే విడిభాగాల సరఫరా విషయంలో తమకెలాంటి సమస్యల్లేవని దైకిన్ ఇండియా ఎమ్‌డీ కన్వల్జిత్ జావా పేర్కొన్నారు. అయితే కోవిడ్–19 వైరస్ ప్రభావం సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపగలదని వ్యాఖ్యానించారు.
విడిభాగాల ధరలు 25–50 శాతం అప్..!
కరోనా కల్లోలం ఇలాగే కొనసాగితే, విడిభాగాల ధరలు 25–50% వరకూ పెరుగుతాయని సూపర్‌ప్లాస్ట్రానిక్స్(ఎస్‌పీపీఎల్) సీఈఓ అవ్‌నీత్ సింగ్ మర్హ ఆందోళన వ్యక్తం చేశారు. పులి మీద పుట్రలా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వాయిదా పడటం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావమే చూపుతున్నాయని పేర్కొన్నారు.
డిమాండ్ తగ్గుతున్నా, తప్పని ధరల పెంపు...
ముడి పదార్థాల ధరలు పెరగడం, జీఎస్‌టీలో అధిక స్లాబ్ రేట్ కారణంగా 2017, 2018 సంవత్సరాల్లో ఏసీ, ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటి కన్సూమర్ డ్యూరబుల్ అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే గత ఏడాది ఈ వస్తువుల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది మరింత మెరుగ్గా అమ్మకాలు ఉండగలవన్న అంచనాలను కరోనా వైరస్ కాటేసింది. అంతే కాకుండా కంప్రెసర్లు, మోటార్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లపై కస్టమ్స్ సుంకాలను కేంద్రం పెంచింది. దీంతో అమ్మకాలు తగ్గుతున్నా, ధరలను పెంచక తప్పని విచిత్ర పరిస్థితుల్లో తయారీదార్లు చిక్కుకున్నారు. అమ్మకాలు తగ్గుతున్నా, 32 అంగుళాలకు మించిన టీవీల ధరలు ఈ నెలాఖరు నుంచి 15% పెంచాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఇటీవలనే మొబైల్ ఫోన్లపై జీఎస్‌టీని 12% నుంచి 18%కి పెంచడం మొబైల్ కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపనున్నది. జీఎస్‌టీ పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం... ఇలాంటి కారణాల వల్ల ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతాయని, ఫలితంగా డిమాండ్ తగ్గగలదని అసస్ ఇండియా బిజినెస్ హెడ్(మొబైల్స్) దినేశ్ శర్మ చెప్పారు. మొబైల్స్‌పై జీఎస్‌టీ పెంపు మొబైల్ ఫోన్ల రంగంపై తీవ్రమైన ప్రభావమే చూపుతుందని, అంతేకాకుండా వేలాది ఉద్యోగాలు పోతాయని ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిం ది. ఇది రిటైల్ రంగాన్ని, వినియోగదారుల సెంటిమెంట్‌ను అతలాకుతలం చేయగలదని పేర్కొంది. (కోవిడ్: నిమిషాల్లోనే నిర్ధారణ!)
Comments
Please login to add a commentAdd a comment