
కంపెనీల విశ్వాసం కనిష్టానికి..
భారతీయ కంపెనీల విశ్వాసం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) క్షీణించింది. 2005 నుంచి చూస్తే ఇదే అత్యంత కనిష్ట స్థాయి.
మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల విశ్వాసం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) క్షీణించింది. 2005 నుంచి చూస్తే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొని ఉన్న అస్థిర పరిస్థితులు ప్రధాన కారణంగా ఉన్నాయి. గత త్రైమాసికంతో పోలిస్తే ఏడు పరిశ్రమ రంగాల్లో నాలుగింటిలో అంచనాలు బలహీనంగానే ఉన్నాయి. మరీముఖ్యంగా తయారీ, ఫైనాన్స్ రంగంలో నియామక అంచనాలు ఏమంత ఆశాజనకంగా లేవు. దేశవ్యాప్తంగా 4,910 కంపెనీలు పాల్గొన్న సర్వేలో ఆరు వరుస త్రైమాసికాల్లో నియామకాల కార్యకలాపాలు నెమ్మదించవచ్చనే అభిప్రాయం వెలువడింది. మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఏడవ స్థానంలో భారత్..: అంతర్జాతీయంగా పలు దేశాల్లో నియామకాల అంచనాల్ని పరిశీలిస్తే.. జపాన్, తైవాన్, హంగేరీ దేశాల్లోని కంపెనీలు నియామకాల ప్రక్రియపై సానుకూలంగానే ఉన్నాయి. ఇక భారత్.. 14 శాతం ఉపాధి అంచనాలతో ఏడవ స్థానంలో నిలిచింది. ‘గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొని ఉంది. దీంతో భారత్‌లోని కంపెనీలు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నాయి. దీని వల్ల సంస్థలు నియామకాలపై ఆశావహంగా లేవు’ అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎ.ఆర్.రావు తెలిపారు.