కింగ్ ఫిషర్ ‘పీఎఫ్’ అవకతవకలపై విచారణ
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ప్రావిడెంట్ ఫండ్ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు లిక్కర్ కింగ్ విజయమాల్యాను చుట్టుముడుతున్నాయి. ఈ అంశాలపై విచారణకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) ఒక ప్రత్యేక విచారణా బృందాన్ని నియమించింది. మాల్యా ప్రమోట్ చేసిన ఎయిర్‌లైన్స్‌కు పీఎఫ్ బకాయిల విషయమై, రూ.7.62 లక్షలకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ ఒక నోటీసును కూడా జారీ చేసినట్లు కార్మిక మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా కంపెనీ ఈపీఎఫ్ బకాయిలు చెల్లించకపోవడానికి సంబంధించి కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, కింగ్‌ఫిషర్ సభ్యుల నుంచి గానీ లేక యూనియన్ల నుంచి కానీ ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదూ నమోదుకాలేదని కార్మికమంత్రిత్వశాఖ తెలిపింది. 2015 సెప్టెంబర్‌కు ముందు కింగ్ ఫిషర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాలంలో ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బ్యాంకులకు భారీ బకాయిలు పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో... మాల్యా మార్చి 4న దేశం వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం పెద్ద చర్చకు దారితీసింది.
మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలు, ఎగవేతపై చర్యల వివరాలు తెలపాలంటూ 17 బ్యాంకులను కోరగా ఇప్పటిదాకా అరడజను బ్యాంకులు నివేదికలు ఇచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) వర్గాలు తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, మనీ లాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అటు, రుణాల డిఫాల్టుపై కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యూబీగ్రూప్‌ల మాజీ సీఎఫ్‌వోలను సీబీఐ మంగళవారం కూడా ప్రశ్నించింది.