ఈపీఎఫ్‌ఓ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు 15%కి! | EPFO trustees likely to raise ETF investments to 15 per cent | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌ఓ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు 15%కి!

Published Mon, May 15 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

ఈపీఎఫ్‌ఓ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు 15%కి!

ఈపీఎఫ్‌ఓ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు 15%కి!

న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెంచేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) సమాయత్తమవుతోంది.   ప్రస్తుతం ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌)లో ఈసీఓఎఫ్‌ఓ పెట్టుబడులు 10 శాతంగా ఉండగా.. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో 15 శాతానికి పెంచే అవకాశం ఉంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలోని ఈపీఎఫ్‌ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ త్వరలో ఈ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈపీఎఫ్‌ఓ నిధుల్లో పెట్టుబడులకు అనువైన మొత్తం వార్షికంగా దాదాపు రూ.లక్ష కోట్ల వరకూ ఉంటుంది. ఈ నిధుల్లో ఇప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో రూ. 10,000 కోట్ల వరకూ పెట్టుబడి చేస్తుండగా,  ఈ పెట్టుబడి పరిమితిని 15 శాతానికి పెంచితే.. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.15,000 కోట్లను స్టాక్స్‌లో మదుపు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి గత నెల 12న జరిగిన సీబీటీ సమావేశంలో ఈ ప్రతిపాదనకు సంబంధించి ప్రధానంగా చర్చించారు. అయితే, ఈ అంశంపై ఈపీఎఫ్‌ఓ ఫైనాన్స్‌ ఆడిట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ(ఎఫ్‌ఏఐసీ) సూచనలు తీసుకోవాలని కొందరు సభ్యులు పేర్కొనడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు.

 అదేవిధంగా ప్రభుత్వ బాండ్‌లు(సెక్యూరిటీస్‌), ఈటీఎఫ్‌ పెట్టుబడులు.. రాష్ట్రాలకు ఇచ్చిన రుణాలపై రాబడులను పెంచేందుకుగాను నిర్ధిష్టమైన పెట్టుబడి ఉపసంహరణ విధానం(ఎగ్జిట్‌ పాలసీ) ఉండాలని కూడా సీబీటీ సభ్యులు గత సమావేశంలో పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరగనున్న ఎఫ్‌ఏఐసీ సమావేశంలో ఈపీఎఫ్‌ఓ  ఈ ఎగ్జిట్‌ పాలసీని సమర్పించనుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. మే 27న సీబీటీ భేటీ జరగనుంది.

18 శాతం పైగా రాబడి...
ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకూ ఈటీఎఫ్‌లలో ఈపీఎఫ్‌ఓ రూ.18,069 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. దీనిపై 18.13 శాతం రాబడులు వచ్చినట్లు అంచనా. కాగా, ఈపీఎఫ్‌ఓ నిర్వహిస్తున్న పలు సామాజిక భద్రత పథకాల కవరేజీకి సంబంధించి ఉద్యోగుల నెలవారీ వేతన పరిమితిని ఇప్పుడున్న రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే అంశంపై కూడా సీబీటీ తదుపరి భేటీలో నిర్ణయం తీసుకోనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement