ఈపీఎఫ్వోపై దత్తాత్రేయ సంచలన ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన ప్రకటన చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పెట్టుబడుల శాతాన్ని భారీగా పెంచుతున్నట్టు ప్రకటించారు. ఒక వైపు కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమ వుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లలో..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) పెట్టుబడుల పరిమితిని 10 శాతానికి పెంచుతున్నట్టు బండారు దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో చెప్పారు.
సుమారు 13 వేల కోట్ల రూపాయల రిటైర్ మెంట్ ఫండ్ ను పెట్టుబడిగా పెట్టనున్నట్టు గురువారం ప్రకటించారు. ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో రూ 1,500 కోట్లు మిగిలిన ఆరు నెలల్లో రూ 11,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని తెలిపారు. కార్మికులు డబ్బుల సంరక్షణకు కట్టుబడి వున్నామని , వారి సొమ్ముకు మంచి లాభాలు రాబట్టడం తమ బాధ్యత అని మంత్రి చెప్పారు. 2015-16 సంవత్సరంలో రూ. 6,577 పెట్టుబడులకు మంచి ఫలితం వచ్చిన అనుభవం ఉందని దత్తాత్రేయ స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ)సమావేశంలో రెండు సార్లు దీనిపై చర్చించామని..కొంతమంది అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ( కార్మికమంత్రిత్వ శాఖ)బోర్డుల కంటే ఉత్తమమని లేబర్ సెక్రటరీ శంకర్ అగర్వాల్ చెప్పారు.
మరోవైపు కార్మిక శాఖ నిర్ణయంపై కార్మిక నాయకులు అశోక్ సింఘ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈపిఎఫ్ఓ ట్రస్టీల ఆమోదం లేకుండా "ఏకపక్ష" నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అభ్యంతరాలను లక్ష్య పెట్టకుండా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని, దీనిపై మిగతా యూనియన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకుడు సచ్ దేవ్ హెచ్చరించారు.