రాజన్ కి జై కొట్టిన నెటిజన్లు
న్యూఢిల్లీ : రిజర్వు బ్యాంకు గవర్నర్ గా రఘురామ్ రాజన్ కే రెండో సారి బాధ్యతలు అప్పజెప్పాలా..? వద్దా..? అంటే కచ్చితంగా రాజన్ కే సెకండ్ ఇన్నింగ్స్ అప్పజెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఫైర్ బ్యాండ్ బీజేపీ నేతలే రాజన్ పదవి పొడిగింపును వ్యతిరేకిస్తున్నా... రాజన్ కు మద్దతు పలికేందుకే మెజార్టీ సభ్యులు ఓకే చెబుతున్నారు. దీంతో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ మద్దతు అంతాఇంతా కాదని అర్థమవుతోంది.
9,168 మందిపై ఈటీమార్కెట్లు.కామ్ జరిపిన సర్వేలో 69శాతం మంది రాజన్ ఫర్ ఫెక్ట్ అని.. ఎలాంటి వంకలు పెట్టాల్సినవసరం లేదంటూ 10వ ర్యాంకును ఇచ్చారు. 87శాతం మంది ఆర్ బీఐ గవర్నర్ గా రెండోసారి రాజన్ నే ఎంపికచేయాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. దీంతో భారత ప్రజల హృదయాల్లో, మైండ్ లో ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ కు సముచిత స్థానం ఉన్నట్టు ఈ సర్వే ద్వారా వెల్లడవుతోంది. ఈటీమార్కెట్లు. కామ్ వెల్లడించిన ఈ సర్వే ఫలితాలపై రాజకీయ నాయకులు మౌనం వహిస్తున్నారు.
సర్వేలో వెల్లడైన కీలక అంశాలు...
- రాజన్ ను చికాగో పంపించేయాలి.. ఆర్ బీఐ గవర్నర్ గా దేశానికి ఏమాత్రం పనికిరాడని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలను 86శాతం మంది కొట్టిపారేశారు.
- ద్రవ్యోల్బణం నియంత్రించడానికి వడ్డీరేట్లు తగ్గిస్తూ రాజన్ తీసుకున్న నిర్ణయం దేశానికి నష్టం వాటిల్లేలా చేసిందన్న సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు తప్పుగా పేర్కొంటూ 78శాతం మంది అభిప్రాయం వ్యక్తంచేశారు.
- 87శాతం మంది రాజన్ కే ఆర్ బీఐ సెకండ్ ఇన్నింగ్స్ అప్పజెప్పాలన్నారు.
- 1 నుంచి 10 మధ్యలో రాజన్ కు రేటింగ్ కేటాయించగా... ఫర్ ఫెక్ట్ అని తెలుపుతూ 10 ర్యాంకింగ్ ను 69శాతం ఇచ్చారు.