
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతమిచ్చే దిశగా వాణిజ్య, పరిశ్రమల శాఖ సర్టిఫై చేసిన స్టార్టప్స్‌కు ఏంజెల్ ట్యాక్స్ నుంచి పూర్తి స్థాయిలో మినహాయింపు ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై పారిశ్రామిక, దేశీ వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ), కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు చర్చలు జరుపుతున్నట్లు వివరించాయి. ఏంజెల్ ఫండ్స్‌కి సంబంధించిన పెట్టుబడుల పరిమితిని అధిక స్థాయిలో ఉంచడం ద్వారా పెద్ద సంఖ్యలో స్టార్టప్స్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుందని పేర్కొన్నాయి.
ఆదాయ పన్ను శాఖ నుంచి ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సంబంధించి ట్యాక్స్ నోటీసులు వస్తుండటంతో ఇప్పటికే పలు స్టార్టప్స్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. స్టార్టప్స్‌లో రూ. 10 కోట్ల దాకా ఏంజెల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులకు ప్రభుత్వం గతేడాది పన్ను మినహాయింపులు అనుమతించింది. పూర్తి స్థాయిలో మినహాయింపునివ్వాలంటూ స్టార్టప్ సంస్థలు కోరుతున్నప్పటికీ.. అలాకాకుండా పరిమితిని మాత్రమే రూ. 25–40 కోట్లకు పెంచే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.