పేరే కాదు... తీరూ వేరువేరే! | FDI and NCDs are both the interest income | Sakshi
Sakshi News home page

పేరే కాదు... తీరూ వేరువేరే!

Published Mon, Jun 11 2018 2:04 AM | Last Updated on Thu, Apr 4 2019 5:22 PM

FDI and NCDs are both the interest income - Sakshi

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గురించి మనలో దాదాపు అందరికీ తెలుసు. కానీ, కంపెనీలు జారీ చేసే నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) గురించి తెలిసిన వారు మాత్రం తక్కువే. నిజానికివి కూడా డిపాజిట్ల లాంటివే. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో వడ్డీ రేటు 7 శాతానికి అటూ, ఇటుగానే ఉంటే... ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీలు డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇస్తుండగా... ఎన్‌సీడీల్లో వడ్డీ రేటు 9 శాతంపైనే ఉంటోంది. దీంతో అధిక వడ్డీ రేటు లభించే ఎన్‌సీడీల పట్ల ఆకర్షితులవటం సహజమే. అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌తో పోలిస్తే ఎన్‌సీడీలు కాస్త భిన్నమైనవి. వీటి విలువను ఎలా అంచనా వేయాలనే విషయమై నిపుణులు చెబుతున్న అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న కథనమిది... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

నిబంధనలు వేర్వేరు
ఎన్‌సీడీలు, ఎఫ్‌డీల మధ్య నియంత్రణ పరంగా, వాటి నిర్మాణం పరంగా, రిస్క్‌ పరంగా చాలా వ్యత్యాసం ఉంది. ఆర్‌బీఐ వద్ద ప్రత్యేకంగా నమోదు చేసుకున్న ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి అనుమతి ఉంది. అందులోనూ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న వాటినే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల స్వీకరణకు ఆర్‌బీఐ అనుమతినిస్తోంది. ఈ కంపెనీలు కూడా తమ సొంత నిధులతో పోలిస్తే గరిష్టంగా ఒకటిన్నర రెట్ల వరకే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు వీలుంటుంది. అలాగే, 1–5 ఏళ్ల కాల వ్యవధితో జారీ చేయాలి. పైపెచ్చు వార్షిక వడ్డీ 12.5%కి మించి ఆఫర్‌ చేయడానికి వీల్లేదు. ఈ సంస్థలు స్వీకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ఆడిటర్లు ఎప్పటికప్పుడు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్‌సీడీలను కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేస్తాయి. మనీ మార్కెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ కావడంతో వీటిని సెబీ నియంత్రిస్తుంటుంది. కనుక వీటిని జారీ చేసే కంపెనీలు ఇన్వెస్టర్లకు సమగ్ర వివరాలను ‘సెల్ఫ్‌ ప్రాస్పెక్టస్‌’ కింద వెల్లడించాలి. ఈ ప్రాస్పెక్టస్‌లో కంపెనీ వివరాలు, ఆర్థిక సమాచారం, రిస్క్‌ అంశాలు, వడ్డీ రేటు, మెచ్యూరిటీ తేదీ తదితర వివరాలు తెలియజేయాలి. ఎన్‌సీడీలను జారీ చేసే ప్రతి ఎన్‌బీఎఫ్‌సీ తన క్రెడిట్‌ రేటింగ్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇన్వెస్టర్ల డిబెంచర్ల ఉపసంహరణలకు తగినన్ని నిధులను నిర్వహించాలి. మొత్తం ఎన్‌సీడీల్లో సుమారు 25% మేర రిజర్వ్‌గా ఉంచాలి. 

క్రెడిట్‌ రేటింగ్‌ చాలా ముఖ్యం...
బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటు ఉండటంతో ఇన్వెస్టర్లు ఎన్‌సీడీల పట్ల ఆకర్షితులవుతుంటారు. కానీ, అధిక వడ్డీ రేటు ఆఫర్‌ చేస్తున్నట్టు అయితే డిఫాల్ట్‌ రిస్క్‌ పెరుగుతున్నట్టుగా భావించాలి. అందుకే ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఆయా ఇష్యూలకు సంబంధించి రిస్క్‌ ఏ మేరకు అన్నది తెలుసుకోవాలంటే, రేటింగ్‌ ఏజెన్సీలిచ్చిన క్రెడిట్‌ రేటింగ్‌ను గమనించడం ఓ చక్కని మార్గం. సాధారణంగా ఎన్‌సీడీలు ‘ఎ’ నుంచి ‘ఎఎఎ’ రేటింగ్‌ కలిగినవి అయితే తక్కువ రిస్క్‌ను సూచిస్తాయి. అదే ‘బిబిబి’ లేదా అంతకంటే తక్కువ రేటింగ్‌ ఉన్నవయితే మధ్యస్థం నుంచి అధిక డిఫాల్ట్‌ రిస్క్‌ కలిగి ఉన్నాయని అర్థం. అందుకని ఇన్వెస్ట్‌ చేసే ముందు ఎన్‌సీడీ క్రెడిట్‌ రేటింగ్‌ను చూడాలి. ఇన్వెస్ట్‌ చేసిన తర్వాత కూడా రేటింగ్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో రేటింగ్‌ మారిపోవచ్చు. 

డిపాజిట్లకన్నా రిస్క్‌ ఎక్కువే...
సెబీ ఇన్ని రకాల నియంత్రణలు విధించినప్పటికీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే ఎన్‌సీడీల్లో రిస్క్‌ ఎక్కువే. ఎలా అంటే... 
►ఎన్‌సీడీలను తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఉన్న కంపెనీలు కూడా జారీ చేయొచ్చు. కానీ, ఎఫ్‌డీలను మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ ఉన్నవే జారీ చేస్తాయి. 
►చెల్లింపుల్లో విఫలమైతే లేదా ఆలస్యం అయితే ఎన్‌సీడీలతో పోలిస్తే ఎఫ్‌డీల విషయంలో నియంత్రణ సంస్థలు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తాయి. ఎఫ్‌డీ చెల్లింపుల్లో విఫలమైతే ఆ కంపెనీపై కంపెనీ లాబోర్డు లేదా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. లేదా సివిల్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. అదే ఎన్‌సీడీల చెల్లింపుల్లో వైఫల్యం ఉంటే ఇన్వెస్టర్లు మొదట అదే కంపెనీ డిబెంచర్స్‌ ట్రస్టీని సంప్రతించాల్సి ఉంటుంది. 
►ప్రజల నుంచి డిపాజిట్ల సమీకరణకు ఆర్‌బీఐ అనుమతి లేని ఎన్‌బీఎఫ్‌సీలూ  తమ నిధుల అవసరాలకు అధిక ఈల్డింగ్‌తో కూడిన ఎన్‌సీడీలతో బాండ్‌ మార్కెట్‌లోకి వెళుతుంటాయి. ఉదాహరణకు శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, కొసమట్టమ్‌ ఫైనాన్స్, ముత్తూట్‌ ఫిన్‌కార్ప్, జేఎం ఫైనాన్షియల్‌ కంపెనీలు ఇటీవలే లాంచ్‌ చేసిన ఎన్‌సీడీల ఆఫర్లే. కారణం, వీటికి ప్రజల నుంచి ఎఫ్‌డీలను సమీకరించేందుకు ఆర్‌బీఐ రిజిస్ట్రేషన్‌ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 

సెక్యూరిటీ ఎంత?
ఎన్‌సీడీల్లోనూ సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ ఉంటాయి. సెక్యూర్డ్‌ కాస్త నయం. కంపెనీ దగ్గర నిధులు లేకుండా పోతే హామీలను విక్రయించి చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. ఇక దీర్ఘకాల ఎన్‌సీడీలు చూడ్డానికే ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ రేట్లు ఉంటాయి. అయితే, దీర్ఘకాలంలో ఓ కంపెనీ క్రెడిట్‌ సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టం. ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగిపోతే అధిక రాబడులు వచ్చే వాటిల్లోకి పెట్టుబడులను మళ్లించుకునే అవకాశం కోల్పోతారు. అందుకని ఐదేళ్లకు మించి లాకిన్‌ ఉండే ఎన్‌సీడీలకు దూరంగా ఉండటమే నయం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement