కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల అవగాహనకోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లపై వినియోగదారుల అవగాహనకోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ పరిధిలో వివిధ పన్నులరేట్లపై సందేహాలను నివృత్తి చేసేందుకు మొబైల్ యాప్‌ను శనివారం ప్రారంభించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒక 'జీఎస్ఎం రేట్స్ ఫైండర్' పేరుతో ఆ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. దీని ద్వారా గూడ్స్, సర్వీసు టాక్స్ వివిధ పన్ను రేట్లను తెలుసుకోవచ్చు. అన్నిఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఈ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ లో త్వరలో విడుదల చేయనుంది. అంతేకాదు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆఫ్‌లైన్ మోడ్‌లోనూ ఈ యాప్ పనిచేయడం దీని ప్రత్యేకత.
‘జీఎస్‌టీ రేట్స్ ఫైండర్’ పేరుతో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఈ మొబైల్ యాప్‌ను తీసుకువచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ఏయే వస్తువులపై ఏ పరిధిలో ఎంత పన్ను విధిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతొపాటు వివిధ రేట్లు తెలుసుకునేందుకు వినియోగదారులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ వెబ్‌సైట్ http://cbec-gst.gov.in కు కూడా లాగిన్ అవ్వవచ్చు. కొత్త పరోక్ష పన్ను పాలసీ ప్రకారం పన్ను చెల్లింపుదారుడు వర్తించే సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, యూటీజీఎస్‌టీ పన్ను రేటు, పరిహారం సెసేస్ కోసం శోధించవచ్చని మంత్రిత్వ శాఖ వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా తదితరులు ఈ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీపై సందేహాలు, అనుమానాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. ఆస్క్ జీఎస్టీ పేరుతో ట్విట్టర్‌లో సందేహాలను తీరుస్తోంది. అలాగే దూరదర్శన్ ద్వారా ఆరు రోజుల పాటువివిధ అంశాలపై అవగాహన, ప్రశ్నోత్తరాలను నిర్వహిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా 60 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే అతి పెద్ద సంస్కరణగా చెబుతున్న కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
GST Rate Finder app of CBEC is available on google play store. ioS version will be launched shortly. #GSTSimplified #GSTForCommonMan pic.twitter.com/WhJMo03rHA
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 8, 2017