మిడ్‌క్యాప్ విభాగంలో మంచి రాబడులు ఆశిస్తూ అదే సమయంలో పెట్టుబడులకు భద్రత ఉండాలని భావించే వారు తప్పక పరిశీలించాల్సిన పథకాల్లో ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ కూడా ఒకటి. కనీసం ఐదేళ్లు ఆ పై వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేసేవారు ఎంపిక చేసుకునే మంచి పేరున్న పథకాల్లో ఇదీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం ప్రారంభమై 25 ఏళ్లు అయింది. అప్పటి నుంచి చూసుకుంటే రాబడుల్లో మేటిగానే కొనసాగుతోంది.
రాబడులు
ఈ పథకం ప్రారంభమైన దగ్గర్నుంచీ సగటున ప్రతీ ఏటా 20% రాబడులను ఇచ్చిందంటే దీని పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకం రాబడులకు ప్రామాణిక సూచీ నిఫ్టీ 500. మూడేళ్ల కాలంలో ఈ పథకంలో రాబడులు సగటున ఏటా 11.4%గా ఉన్నాయి. బెంచ్ మార్క్ నిఫ్టీ 500 రాబడులు ఈ కాలంలో ఏటా 9.3 శాతమే. ఐదేళ్ల కాలంలో ఏటా సగటున ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ 24.1% రాబడులను ఇవ్వగా, బెంచ్ మార్క్ రాబడులు 14.9%గానే ఉన్నాయి. పదేళ్ల కాలంలో చూసుకున్నా ఈ పథకమే అగ్ర స్థాయిలో ఉంది. ఏటా సగటున 18.1% రాబడులను ఇవ్వగా... ఇదే కాలంలో నిఫ్టీ–500 రాబడులు ఏటా సగటున 10.6% కావడం గమనార్హం.
భిన్న రంగాలు, ఆయా రంగాల్లో భిన్న స్టాక్స్ మధ్య పెట్టుబడులను వర్గీకరించడం ద్వారా రిస్క్‌ను తగ్గించడం ఈ పథకం నిర్వహణ పనితీరులో భాగం. ఇక లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను యాడ్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ, లార్జ్‌క్యాప్‌లో పెట్టుబడులను 15 శాతంలోపునకే పరిమితం చేస్తుంది. ఈ విధమైన వ్యూహాత్మక విధానాలతోనే మిడ్ క్యాప్ విభాగంలో రాబడులు, భద్రతా పరంగా ఈ పథకం మెరుగైన స్థాయిలో ఉంది. ఈ విభాగంలో నంబర్ 1 కాకపోయినప్పటికీ... కేటగిరీతో పోలిస్తే సగటు కంటే ఎక్కువే రాబడులను ఇస్తూ ముందుండటం గమనించాలి. గడిచిన పదేళ్ల కాలంలో ఎస్‌బీఐ మ్యాగ్నం మిడ్‌క్యాప్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మిడ్‌క్యాప్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మిడ్‌క్యాప్ పథకాల కంటే పనితీరులో మెరుగ్గా ఉంది.
పోర్ట్‌ఫోలియో, స్ట్రాటజీ
స్టాక్స్ ఎంపికలోనూ ఫండ్ మేనేజర్లు జాగ్రత్తలు పాటిస్తుంటారు. విడిగా ఒక్కో స్టాక్‌లో పెట్టుబడులు 3–4% మించనీయరు. ఎంత ఉత్తమ కంపెనీ అయినా సరే 4% దాటకపోవడం గమనించాలి. అంటే రిస్క్, రాబడుల కోణంలోనే ఈ నియమాన్ని అమలు చేస్తున్నట్టు లెక్క. పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్ 50–60 వరకు ఉంటాయి. మార్కెట్లు ర్యాలీ సమయాల్లో రాబడులను అందించే విషయంలో మంచి స్థితిలో ఉండటం, అదే సమయంలో మార్కెట్ కరెక్షన్లలో నష్టాలు పరిమితంగా ఉండటం ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల అస్థిరత సమయాల్లో 7–9% వరకు నగదు నిల్వలను కొనసాగిస్తుంది.
ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌లో పెట్టుబడులను కలిగి ఉంది. గత ఏడాది కాలంలో ఆటో యాన్సిలరీ, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ రంగాల్లో ఎక్స్‌పోజర్‌ను పెంచుకుంది. ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి దిశగా సాగిపోతే ఈ రంగాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయి. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లోనూ గత కొన్నేళ్లుగా పెట్టుబడులను పెంచుకుంటూ వస్తోంది. ఇక ఏడాది కాలంలో ఐటీ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుంది. దీంతో ఈ కాలంలో ఐటీ స్టాక్స్ ర్యాలీ చేయడంతో ఆ అవకాశం కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment