
బెంగళూరు : స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన కారణంగా మానసిక వేదన అనుభవించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదును స్వీకరించిన స్విగ్గీ యాజమాన్యం.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పడంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్ పంపింది. అయితే కేవలం క్షమాపణలే సరిపోవన్న ఆమె అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో డెలివరీ బాయ్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. వివరాలు... కర్ణాటకకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో భోజనం ఆర్డర్ చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్.. డోర్ తీయగానే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తనకు సహకరించాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వెంటనే తేరుకున్న సదరు మహిళ.. త్వరగా తలుపు మూసేసి లోపలికి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి గురువారం ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. అతడి ప్రవర్తన కారణంగా తనకు ఇప్పటికీ అన్నం సహించడం లేదని.. ఇలాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. తనలాగా మరికొంత మంది మహిళలకు కాకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని షేర్ చేశానని పేర్కొన్నారు. దీంతో దిగి వచ్చిన స్విగ్గీ యాజమాన్యం.. ఈ నేపథ్యంలో మొదట కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అలా జరిగి ఉంటుందని చెప్పిన స్విగ్గీ యాజమాన్యం ఎట్టకేలకు ఆమెకు క్షమాపణలు చెప్పింది. దాంతో పాటుగా రూ. 200 విలువైన కూపన్‌ను ఆమెకు అందజేసింది. అలాగే ఆమె డిమాండ్ మేరకు సదరు డెలివరీ బాయ్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment