బేస్‌రేటుకే గ్రామీణులకు గృహ రుణం
- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయం
- రూ. 15 లక్షల వరకూ రుణసౌలభ్యం
ముంబై: బేస్‌రేటుకే (బ్యాంక్ కనీస రుణ రేటు) గ్రామీణులకు గృహ రుణం అందించాలని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ నిర్ణయించింది. రూ.15 లక్షల వరకూ ఈ రుణ వెసులుబాటు గ్రామీణులకు లభించనుంది. ప్రస్తుతం బ్యాంక్ కనీస రుణ రేటు 9.7 శాతం. మహిళా రుణాలను ఇప్పటికే బ్యాంక్ బేస్‌రేటుకు ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగంలో తనకు వ్యాపార ప్రత్యర్థిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు బేస్‌రేటుకే (9.7 శాతం)గృహ రుణ రేటును అందిస్తున్న నేప థ్యంలో- ఐసీఐసీఐ బ్యాంక్ తన రుణ బేస్‌ను పెంచుకునేందుకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టింది.
సామాజిక ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా...
కాగా తమ నిర్ణయంపై బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ ఒక ప్రకటన చేస్తూ... సమాజంలో మెజారిటీ ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఐసీఐసీఐ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. తమ 4,052 బ్రాంచీల్లోని 189లో గ్రామీణ రుణాలు లభ్యమవుతాయని తెలిపారు. ‘ఐసీఐసీఐ బ్యాంక్ సరళ్-రూరల్ హౌసింగ్ లోన్’ కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ రుణం లభిస్తోంది. రుణ కాలవ్యవధి 3 నుంచి 20 ఏళ్లు. బేస్‌రేటు మార్పులకు అనుగుణంగా ఇచ్చిన రుణంపై వడ్డీరేటు కూడా మారుతుంది. గృహ కొనుగోళ్లు, నిర్మాణం, ఆధునీకీకరణలకుగాను గ్రామీణులకు ఈ రుణ సౌలభ్యం ఉంటుంది.