ఫోర్డ్ ‘ఫిగో’, ‘యాస్పైర్’లలో స్పోర్ట్స్ ఎడిషన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’, కాంపాక్ట్ సెడాన్ ‘యాస్పైర్’లలో కొత్త స్పోర్ట్స్ ఎడిషన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.21 లక్షలుగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.31 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. ఇక యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ (1.5 లీటర్ డీజిల్ టైటానియన్ వెర్షన్) ధరను రూ.7.6 లక్షలుగా, 1.2 లీటర్ పెట్రోల్ టైటానియమ్ వెర్షన్ యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ ధరను రూ.6.5 లక్షలుగా నిర్ణయించామని పేర్కొంది.
కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కస్టమర్లకు నచ్చే ప్రొడక్టులను తీసుకువస్తూ, పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటూ, మార్కెట్‌లో తమ వాటాను మరింత పదిలం చేసుకుంటామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. కొత్త వెర్షన్లలో 15 అంగుళాల అలాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసెంజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.