భారత్‌లో విదేశీ యాపిల్స్‌ హవా | foreign apple's marketing in india | Sakshi
Sakshi News home page

భారత్‌లో విదేశీ యాపిల్స్‌ హవా

Published Sat, Apr 1 2017 12:24 AM | Last Updated on Thu, Oct 4 2018 7:50 PM

భారత్‌లో విదేశీ యాపిల్స్‌ హవా - Sakshi

భారత్‌లో విదేశీ యాపిల్స్‌ హవా

ఏటా 20 కోట్ల కిలోలు దిగుమతి
తెలుగు రాష్ట్రాల్లో మూడో స్థానం వీటిదే
ప్రీమియం విభాగంలో క్లబ్‌ వెరైటీలు  


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రెడ్‌ డెలీషియస్, గోల్డెన్‌ డెలీషియస్, గ్రానీ స్మిత్, గలా, ఫ్యూజీ, హనీ క్రిస్ప్‌.. ఇవన్నీ భారత్‌లో ఇప్పుడు పాపులర్‌ అవుతున్న విదేశీ యాపిల్‌ పండ్ల రకాలు. రుచి, రంగు, రూపం, నాణ్యతలో ఆకర్షించే ఈ యాపిల్స్‌ కోసం మనవాళ్లు ఎంతైనా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఇదే ఇప్పుడు విదేశీ ఎగుమతిదారులకు కాసులు కురిపిస్తోంది. టాప్‌–5 దిగుమతి మార్కెట్లలో స్థానం సంపాదించిన భారత్‌పై పలు ఉత్పత్తి దేశాలు పెద్ద ఎత్తున ఫోకస్‌ చేశాయి. భారత్‌కు ఏటా 20 కోట్ల కిలోల యాపిల్స్‌ దిగుమతి అవుతున్నాయంటే పరిస్థితిని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఇందులో వాషింగ్టన్‌ నుంచి 50 శాతం వచ్చి చేరుతున్నాయి. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో యాపిల్‌ పంట దిగుబడి తగ్గడం కూడా దిగుమతులు పెరగడానికి కారణమైందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

క్లబ్‌ వెరైటీలే ప్రియం..
ప్రపంచవ్యాప్తంగా 7,500 రకాల యాపిల్స్‌ ఉన్నాయి. వీటిలో క్లబ్‌ వెరైటీలు ప్రత్యేకమైనవి. స్వీట్యాంగో, పింక్‌ లేడీ, ఎవర్‌క్రిస్ప్, కికూస్, స్మిట్టెన్స్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. సరఫరా పరిమితం కాబట్టి ధర కూడా ఎక్కువే. దేశంలో రిటైల్‌ మార్కెట్లో క్లబ్‌ వెరైటీల ధర కిలోకు రూ.300 పైనే పలుకుతోంది. క్లబ్‌ వెరైటీ అంటే ఒక్కో రకం ఒకరు లేదా కొందరు రైతులకే పరిమితం అన్నమాట. నాణ్యత, రంగు, రుచి, రూపంలో క్లబ్‌ వెరైటీలు వేటికవే ప్రత్యేకం.

వీటి అభివృద్ధికి రైతుల కృషి అంతా ఇంతా కాదు. ఇక ధరను తమ చేతుల్లో పెట్టుకోవటానికి వీటిని ఒకే కంపెనీ మార్కెట్‌ చేస్తుంది. పేటెంటు ఉన్న క్లబ్‌ వెరైటీలూ ఉన్నాయి. ఇప్పుడు పబ్లిక్‌ వెరైటీ అయిన హనీ క్రిస్ప్‌ ఒకప్పుడు టాప్‌ క్లబ్‌ వెరైటీ. ఇప్పటికీ దీని అమ్మకాలే ఎక్కువ. క్లబ్‌ వెరైటీలకు ట్రేడ్‌ మార్క్‌ ఉంటుందని వాషింగ్టన్‌ యాపిల్‌ కమిషన్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రెబెకా లాన్స్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. 5–7 ఏళ్లుగా క్లబ్‌ వెరైటీల సంఖ్య పెరుగుతోందని ఆమె తెలియజేశారు. యాపిల్‌ ఉత్పాదన పెంపు, మార్కెట్‌ విస్తృతి, వాషింగ్టన్‌ రైతుల సంక్షేమం కోసం ఈ కమిషన్‌ కృషి చేస్తోంది.

భారత్‌లో సగటున కిలో..
భారత్‌లో ఏటా 200 కోట్ల కిలోల యాపిల్‌ పండుతోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పంట ఎక్కువ. 20 కోట్ల కిలోల యాపిల్స్‌ విదేశాల నుంచి వచ్చిపడుతున్నాయి. యూఎస్, చైనా, చిలీ, ఇటలీ, న్యూజిలాండ్, ఫ్రాన్స్, టర్కీ తదితర దేశాలు భారత్‌పై దృష్టిసారించాయని వాషింగ్టన్‌ యాపిల్‌ కమిషన్‌ భారత ప్రతినిధి కీత్‌ సుందర్‌లాల్‌ తెలిపారు. భారత్‌లో సగటున ఒక్కో వ్యక్తి ఒక కిలో యాపిల్స్‌ తింటున్నారని చెప్పారు. వినియోగం పరంగా తమిళనాడు, ఢిల్లీ రాజధాని ప్రాంతం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర మూడో స్థానం కోసం పోటీపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement