ఎఫ్‌ఐఐలకు ఐటీ శాఖ ఊరట
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదై, భారత్‌లో శాశ్వత కార్యాలయాలు లేని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు.. సమర్పించిన రిటర్నులు అసంపూర్తిగా ఉన్నా, వాటిని లోపభూయిష్టమైనవిగా పరిగణించబోమని ఆదాయ పన్ను శాఖ (ఐటీ) తెలిపింది. దీంతో దాదాపు 500 పైచిలుకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) ఊరట లభించనుంది. ఆదాయ పన్ను రిటర్నులతో పాటు బ్యాలెన్స్ షీట్లు, లాభనష్టాల ఖాతాల వివరాలను సమర్పించనందుకు గాను పలు ఎఫ్‌ఐఐలు, ఎఫ్‌పీఐలకు ఐటీ శాఖ కొన్నాళ్ల క్రితం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ గణాంకాల ప్రకారం ఇలా నోటీసులు అందుకున్న ఎఫ్‌ఐఐల సంఖ్య 500 పైచిలుకు ఉంటుంది. సాధారణంగా ఈ తరహా ఇన్వెస్టర్లకు భారత్‌లో శాశ్వత ప్రాతిపదికన కార్యాలయాలేమీ ఉండవు కనుక, ఖాతాలను కూడా ఇక్కడ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం వివాదానికి దారి తీయడంతో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా వివరణ ఇచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటిదాకా ఈక్విటీల్లో రూ. 15,519 కోట్లు, డెట్ సాధనాల్లో దాదాపు రూ. 50,116 కోట్లు నికరంగా ఇన్వెస్ట్ చేసినట్లు అంచనా.