
సెప్టెంబర్‌లో ఐపీవోల జాతర!!
♦ పబ్లిక్ ఇష్యూకి రానున్న నాలుగు కంపెనీలు
♦ రూ. 2,500 కోట్ల సమీకరణ ∙
♦ లిస్టులో మ్యాట్రిమోనీడాట్‌కామ్ కూడా
న్యూఢిల్లీ: మెరుగుపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఊతంతో ఇటీవలి కాలంలో కంపెనీలు మళ్లీ ఐపీవోల బాట పట్టాయి. సెప్టెంబర్‌లో నాలుగు సంస్థలు పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. రూ. 2,500 కోట్లు సమీకరించనున్నాయి. ఈ జాబితాలో ఆన్‌లైన్ వివాహ సేవల సంస్థ మ్యాట్రిమోనీడాట్‌కామ్, భారత్ రోడ్ నెట్‌వర్క్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ డిక్సన్ టెక్నాలజీస్, నిర్మాణ రంగ కంపెనీ కెపాసిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ నాలుగూ వచ్చే నెల ఐపీవోకి రాబోతున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిధులను ప్రధానంగా విస్తరణ ప్రణాళికలకోసం, రుణాల చెల్లింపునకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఆయా సంస్థలు వినియోగించనున్నాయి.
ఈసారి మెరుగే..: గతేడాది మొత్తం 26 కంపెనీలు మొత్తం రూ. 26,000 కోట్లు సమీకరించాయి. ఐపీవోలకి సంబంధించి ఆరేళ్లలో ఇవే అత్యుత్తమ గణాంకాలు. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఐపీవో విభాగం గతేడాది కన్నా మెరుగ్గానే ఉండగలదని పరిశీలకులు భావిస్తున్నారు. మధ్యమధ్యలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికీ .. మార్కెట్‌లో బులిష్ సెంటిమెంట్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు ఇరవైకి పైగా కంపెనీలు సెబీకి ఐపీవో ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా మొత్తం 17 కంపెనీలు ఇనీషియల్ షేర్ సేల్ ఆఫర్‌ల ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించాయి. ఇందులో బీఎస్‌ఈ, అవెన్యూ సూపర్‌మార్ట్స్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), ఎరిస్ లైఫ్‌సైన్సెస్, కొచిన్ షిప్‌యార్డ్ మొదలైన సంస్థలు ఉన్నాయి.
ఐపీవోల వివరాలు..
1. భారత్ రోడ్ నెట్‌వర్క్
శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కి సంబంధించిన ఈ సంస్థ ఐపీవో సెప్టెంబర్ 6–8 మధ్యలో రానుంది. రూ. 10 ముఖవిలువ చేసే 29.30 లక్షల ఈక్విటీ షేర్లను ఈ సందర్భంగా విక్రయించనున్నారు. రూ. 1,200 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం.
2. డిక్సన్ టెక్నాలజీస్..
సుమారు రూ. 600–650 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షేర్ హోల్డర్లు 37,53,739 షేర్లను విక్రయించనుండగా, కొత్తగా మరో రూ. 60 కోట్ల విలువ చేసే షేర్లను ఐపీవోలో జారీ చేయనున్నారు. ఈ ఇష్యూ కూడా సెప్టెంబర్ 6న మొదలై 8తో ముగియనుంది.
3. మ్యాట్రిమోనీడాట్‌కామ్..
భారత్‌మ్యాట్రిమోనీ బ్రాండ్ కింద ఆన్‌లైన్ వివాహ పరిచయ వేదిక సేవలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఐపీవో ద్వారా రూ. 350 కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆఫర్ ఫర్ సేల్ కింద 37,67,254 షేర్లను, కొత్తగా రూ. 130 కోట్లు విలువ చేసే షేర్లను జారీ చేయనుంది.
4. కెపాసిటీ
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా కెపాసిటీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.400 కోట్లు సమీకరించవచ్చని అంచనా.