ఫొటోలు, వీడియోలు దాచుకోండి గూగుల్‌లో...
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. రోజుకో కొత్త సర్వీసుతో ఆశ్చర్యపరిచే గూగుల్ తాజాగా మీ డిజిటల్ ఫొటోలన్నింటినీ తానే భద్రపరుస్తానని హామీ ఇస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చిన తరువాత సెల్ఫీలు, కెమెరా క్లిక్, వీడియోలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. వీటిని ఎప్పటికప్పుడు డెస్క్‌టాప్‌లలోకి లేదంటే ఇతర మెమరీ డివెజైస్‌లోకి సింక్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్ సర్వీసుతో ఈ ఇబ్బంది తప్పనుంది. డిజిటల్ ఫొటోలు, వీడియోలను గూగుల్ తన క్లౌడ్ సర్వర్లలో స్టోర్ చేస్తుంది.
ఫొటోలు, వీడియోల సంఖ్య, మెమరీలపై పరిమితులేమీ లేని ఈ సర్వీసు ఉచితంగానే లభిస్తోంది. అయితే మీరు తీసిన ఫొటో రెజల్యూషన్ ఎంతున్నప్పటికీ గూగుల్ ఫొటోస్‌లో 16 మెగాపిక్సెళ్ల స్థాయి వరకూ మాత్రమే స్టోర్ చేస్తారు. పూర్తిస్థాయి రెజల్యూషన్ కావాలంటే మాత్రం గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో దాదాపు 15 జీబీల స్టోరేజీ ఉచితం కాగా, ఆ తరువాత ఒక టీబీ సమాచారం కోసం నెలకు రూ.650 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్‌లో ఫొటోలను గుర్తించడం, వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చడం వంటి పనులన్నీ ఆటోమెటిక్‌గా జరిగిపోతాయి. కొన్ని కీవర్డ్స్ ఆధారంగా ఫొటోలనూ సెర్చ్ చేయగలగడం ఈ సర్వీసుకున్న మరో ప్రత్యేకత.