ఐటీ-ఫార్మాకు అమెరికా గండం
దేశీ ఐటీ, ఫార్మా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ అమెరికాయే.
అక్కడి నుంచి వచ్చే ఆదాయం ఏ స్థాయిలో ఉందో...
ఇపుడు అమెరికా విధిస్తున్న పరిమితులూ అదే రీతిన పెరిగిపోతున్నాయి.
నాణ్యతా ప్రమాణాల పేరుతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ వరస నోటీసులిస్తూ
ఫార్మా సంస్థలను బెంబేలెత్తిస్తుండగా...
వీసా ఫీజుల పెంపుతో ఐటీ కంపెనీలు ఇక్కట్లు పడుతున్నాయి.
వీసా ఫీజుల పెంపుతో ఐటీపై 400 మిలియన్ డాలర్ల భారం
* నోటీసులు, తనిఖీలతో తగ్గుతున్న
* ఫార్మా రంగం ఎగుమతులు
* ఇది మన కంపెనీలను టార్గెట్ చేయటమేనంటున్న పరిశ్రమ నిపుణులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ కంపెనీలు విదేశాలకు అందిస్తున్న సర్వీసుల ద్వారా ఏటా 100 బిలియన్ డాలర్లకు పైగా ఆర్జిస్తున్నాయి. దీన్లో సింహభాగం.. అంటే 60% పైబడి అమెరికా మార్కెట్ నుంచే వ స్తోంది. దీంతో హెచ్1బీ తదితర వీసాలకు భారత ఐటీ కంపెనీల నుంచి భారీగా డిమాండ్ ఉంటోంది.
ఇలా విదేశీ ఐటీ కంపెనీలకు కీలకమైన హెచ్1బీ, ఎల్1 వీసాల ఫీజులను అమెరికా ఏకంగా రెట్టింపు చేసేసింది. హెచ్1బీ ఫీజు 4,000 డాలర్లు, ఎల్1 ఫీజు 4,500 డాలర్ల మేర అదనంగా పెంచింది. కొత్త ఫీజులు 2025 సెప్టెంబర్ 30 దాకా అమల్లో ఉంటాయి. దీన్ని అన్ని దేశాల కంపెనీలకు వర్తింపచేస్తున్నప్పటికీ.. ప్రధానంగా అమెరికాపైనే ఆధారపడిన భారత ఐటీ కంపెనీలకిది శరాఘాతంగా మారింది. ఎందుకంటే హెచ్1బీ వీసాలను అత్యధికంగా ఉపయోగించుకుంటున్నది మన ఐటీ కంపెనీలే. గణాంకాల ప్రకారం 2012లో భారత ఐటీ సంస్థలు అత్యధికంగా 80,630 వీసాలు పొందగా, చైనా కంపెనీలు 11,000కు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో వీసా ఫీజు రెట్టింపుతో భారత ఐటీ పరిశ్రమపై ఏటా 400 మిలియన్ డాలర్ల దాకా భారం పడవచ్చని అంచనా.
అమెరికన్ కంపెనీలు వ్యయాలు తగ్గించుకునేందుకు భారత ఐటీ సంస్థల సేవలు గణనీయంగా తోడ్పడుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి పరి మితులు విధించిన పక్షంలో అమెరికాకే ప్రతికూలం అవుతుం దని ఇటీవలే నాస్కామ్ చైర్మన్‌గా ఎంపికైన సీపీ గుర్నానీ చెప్పారు. వీసాలపై పరిమితులు, ఫీజు పెంపు అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) దృష్టికి కూడా భారత్ తీసుకెళ్లిందని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్, ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీ మోహన్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి తెలిపారు.
ఫార్మాకు నియంత్రణలు..
మెరుగైన జనరిక్స్ ఔషధాలను చౌకగా అందిస్తున్న భారత ఫార్మా కంపెనీల ఆదాయాల్లో దాదాపు 40 శాతం పైచిలుకు అమెరికా మార్కెట్ నుంచే వస్తోంది. అలాగే, అమెరికాలోని జనరిక్స్ అమ్మకాల్లో సుమారు 40 శాతం వాటా భారత ఫార్మా కంపెనీలదే. ఈ మధ్యే అధిక మార్జిన్లుండే ఇంజెక్టబుల్స్ విభాగంలో పట్టు దక్కించుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 2014లో 3.76 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే, ఐటీ కంపెనీల తరహాలోనే భారత ఔషధ సంస్థలూ టార్గెట్ అవుతున్నాయి.
అంతర్జాతీయంగా ఔషధాల సరఫరాలో చైనా కూడా ముందువరుసలోనే ఉన్నప్పటికీ.. 2014-15లో చూస్తే అక్కడి కంపెనీల్లో అమెరికా ఎఫ్‌డీఏ తనిఖీలు 132 మాత్రమే జరగ్గా, భారతీయ కంపెనీలు మాత్రం 203 తనిఖీల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చైనాలో ఇద్దరే ఇన్‌స్పెక్టర్స్ ఉంటే భారత్‌లో ముగ్గురు పూర్తి స్థాయి ఇన్‌స్పెక్టర్లున్నారు. వారికి అదనంగా అడపాదడపా మరింత మంది వస్తుంటారు కూడా. ఔషధాల ఉత్పత్తి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వార్నింగ్ లెటర్లు, ఇంపోర్ట్ అలర్టులతో ఎఫ్‌డీఏ కొన్నాళ్లుగా భారత ఫార్మా సంస్థలను బెంబేలెత్తిస్తోంది.
2008-15 మధ్య కాలంలో ఎఫ్‌డీఏ... భారత ఫార్మా కంపెనీలకు దాదాపు 50 వార్నింగ్ లెటర్లు పంపింది. తర్వాత వీటిలో దాదాపు నలభై శాతం నోటీసులు... ఇంపోర్ట్ అలర్టులుగా మారాయి. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, క్యాడిలా హెల్త్‌కేర్, ఐపీసీఏ లాబోరేటరీస్, లుపిన్ మొదలైన దిగ్గజాలు గతేడాది లెటర్లు అందుకున్న వాటిలో ఉన్నాయి.
అమెరికా ఎఫ్‌డీఏ చర్యలతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీశ్ రెడ్డి ఇటీవలే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో రెండంకెల స్థాయిలో ఉండే ఎగుమతులు ప్రస్తుతం 9.7 శాతానికే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఔషధ మార్కెట్ అయిన అమెరికాకు ఎగుమతులు దెబ్బతినడం వెనుక పలు కారణాలున్నాయని, పేరొందిన భారతీయ కంపెనీలపై ఎఫ్‌డీఏ నియంత్రణపరమైన చర్యలు కూడా కారణమని సతీష్ రెడ్డి చెప్పారు.