అంతర్జాతీయంగా పసిడి దూకుడు..!
♦ 2 వారాల్లో 45 డాలర్లకుపైగా పెరుగుదల
♦ డాలర్ పటిష్టతపై అనుమానాల నేపథ్యం
♦ దేశంలో దూకుడుకు ‘రూపాయి’ బ్రేక్!
న్యూయార్క్/ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అనుమానాలు, దీనితో డాలర్‌పై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా పసిడిపై ప్రభావం చూపుతోంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) ధర 13 డాలర్లు పెరిగి, 1,235 డాలర్లకు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర భారీగా 45 డాలర్లు పెరగడం గమనార్హం. డాలర్ బలహీనతలు, గత వారం ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటన, అమెరికా ఆర్థిక అనిశ్చితి దన్నుగా పసిడి మరింత ముందుకు వెళుతుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. బంగారానికి 1,210 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి. అమెరికా గత ఏడాది నాల్గవ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కనీసం 2.2 శాతం ఉంటుందని విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా 1.9 శాతం వృద్ధి మాత్రమే నమోదయిన సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగ కల్పన తాజా నివేదిక కూడా అమెరికా ఆర్థికంగా ఆశను తగ్గిస్తోంది. దీనితో ఈ ఏడాది ఫెడ్ ప్రణాళిక ప్రకారం మూడుదఫాల రేటుపెంపు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షలు, ఈ పరిస్థితుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు పసిడికి బలాన్ని ఇస్తున్న మరో అంశం.
దేశీయంగా చూస్తే...
అంతర్జాతీయంగా పసిడి దూకుడు ప్రదర్శిస్తున్నా... దేశీయంగా రూపాయి పటిష్టతల్లో మెటల్ దూకుడుకు ఇక్కడ కళ్లెం వేస్తోంది. వారం వారీగా చూస్తే... పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర కేవలం రూ.50 పెరిగి రూ.29,195కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,045కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.415 పెరిగి రూ.42,290కి చేరింది. శుక్రవారం వరకూ గడచిన 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి డాలర్ మారకంలో దాదాపు 1.50 పైసలు బలపడింది. శుక్రవారంతో ముగిసిన వారంలో 66.84 స్థాయిలో ఉంది. రూపాయి ఈ స్థాయిలో బలపడి ఉండకపోతే, పసిడి ధర గడచిన వారంలో దాదాపు మరో రూ.200కుపైగా పెరిగి ఉండేదన్న అంచనాలు ఉన్నాయి.