
నిన్నటిరోజు జీవితకాల రికార్డు స్థాయికి ఎగిసిన బంగారం ధరలో గురువారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా నేటి ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో స్వల్పంగా రూ.64 నష్టపోయి రూ.48,070 వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా కేసులు సంఖ్య అంతర్జాతీయంగా పెరుగుతుండటంతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి రక్షణాత్మక సాధనమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో నిన్నటి రోజున దేశీయంగా బంగారం ధర ఒక దశలో రూ.357 లాభపడి రూ.48589 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. అయితే గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరికి రూ.98 నష్టంతో రూ.48,134 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా 8ఏళ్ల గరిష్టం వద్ద స్థిరంగా:
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గురువారం 8ఏళ్ల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ అనూహ్యంగా ర్యాలీ చేయడం ఇందుకు కారణం అవుతోంది. నేడు ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1డాలరు స్వలలాభంతో 1,774.25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరికి ఫెడ్ రిజర్వ్ మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తారనే ఆశలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్‌లైన ఈక్విటీల వైపు మొగ్గచూపడంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. అయితే కోవిడ్-19 కేసులు రెండో దశ ప్రారంభం కావడంతో పాటు ఐఎంఎఫ్ అంతర్జాతీయ వృద్ది అవుట్‌లుక్‌ను తగ్గించడం తదితర కారణాలతో రానున్న రోజుల్లో బంగారం తిరిగి ర్యాలీ చేసేందుకు అవకాశాలున్నాయని బులియస్ పండితులు చెబుతున్నారు. నిన్నటి రాత్రి అమెరికా మార్కెట్ ముగిసే సరికి ఔన్స్ బంగారం ధర దాదాపు 7డాలర్ల నష్టంతో 1775 డాలర్ల వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment