జీఎస్టీ ప్రయోజనాలు కస్టమర్లకు అందాలి
బిల్డర్లకు ప్రభుత్వం ఆదేశాలు
న్యూఢిల్లీ: జీఎస్టీ ప్రయోజనాలను ఇళ్ల ధరలు/ఇన్‌స్టాల్‌మెంట్ల తగ్గింపు రూపంలో ఇళ్ల కొనుగోలుదారులకు అందజేయాలని బిల్డర్లను ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమల్లోకి వస్తోన్న విషయం తెలిసిందే. జీఎస్‌టీ అమలును బూచిగా చూపిస్తూ, మొత్తం చెల్లింపులను జూలై 1కి ముందే చెల్లించాలని ఇళ్ల కొనుగోలుదారులపై ఒత్తిడి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జీఎస్‌టీ కారణంగా ఫ్లాట్ల, కాంప్లెక్స్‌ల, బిల్డింగ్‌ల నిర్మాణంపై తక్కువ పన్ను భారం పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరోక్ష పన్నులను పరిగణనలో తీసుకుంటే, జీఎస్‌టీ అమలు వల్ల పన్ను భారం తక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఫ్లాట్లు బుక్ చేసుకున్న, కొంత మొత్తం చెల్లించిన కొనుగోలుదారులపై మొత్తం సొమ్ములు జూలై1కి ముందే చెల్లించాలని బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్న ఫిర్యాదులు తమకు అందుతున్నాయని, ఇది జీఎస్‌టీ చట్టానికి వ్యతిరేకమని వివరించింది.
నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, కాంప్లెక్స్‌లు, బిల్డింగ్‌లపై జీఎస్‌టీ కాంట్రాక్ట్ సర్వీస్ ట్యాక్స్‌రేటు 12 శాతమేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.