న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్లు కాదలిచిన వారికి ఎంపిక పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర కార్పొరేట్ శాఖ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. నిజానికి కంపెనీల చట్టం 2013లో ఉత్తమ పరిపాలనకు గాను కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో కార్పొరేట్ అవకతవకల నేపథ్యంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ఇక కార్పొరేట్ వ్యవహారాల్లో ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకోవాలనుకుంటున్న తరుణంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర మరింత కీలకంగా మారింది.
దేశంలో కార్పొరేట్ పాలనను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పీపీ చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్రను బలోపేతం చేయడం ఒక చర్యగా చెప్పారు. కంపెనీల బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యే వారికి తగిన అర్హతలు ఉండాలన్నారు. కనీస అర్హతకు తోడు, ఒక సర్టిఫికేషన్ కోర్స్/ పరీక్ష అనేదానిని పరిశీలిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే ముందు కంపెనీలను సంప్రదిస్తామన్నారు.
అయితే, కొత్తగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవ్వాలనుకునే వారికే పరీక్ష నిర్వహణ ప్రతిపాదన అని, ప్రస్తుతమున్న వారికి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న వారికి అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక, ప్రభుత్వం తీసుకొచ్చే సవరణలతో, ఇండిపెండెంట్ డైరెక్టర్ల డేటా బ్యాంకును ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహణ బాధ్యతలను ఐఐసీఏ ఏజెన్సీ చూస్తుందని మంత్రి చెప్పారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లు కంపెనీల పాలన విధానాలను పర్యవేక్షిస్తూ, సలహాదారులుగా వ్యవహరిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment