pp choudhary
-
ఇండిపెండెంట్ డైరెక్టర్ల ఎంపికకు పరీక్ష
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్లు కాదలిచిన వారికి ఎంపిక పరీక్షలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర కార్పొరేట్ శాఖ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. నిజానికి కంపెనీల చట్టం 2013లో ఉత్తమ పరిపాలనకు గాను కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో కార్పొరేట్ అవకతవకల నేపథ్యంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ఇక కార్పొరేట్ వ్యవహారాల్లో ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకోవాలనుకుంటున్న తరుణంలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర మరింత కీలకంగా మారింది. దేశంలో కార్పొరేట్ పాలనను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు పీపీ చౌదరి తెలిపారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్రను బలోపేతం చేయడం ఒక చర్యగా చెప్పారు. కంపెనీల బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ అయ్యే వారికి తగిన అర్హతలు ఉండాలన్నారు. కనీస అర్హతకు తోడు, ఒక సర్టిఫికేషన్ కోర్స్/ పరీక్ష అనేదానిని పరిశీలిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే ముందు కంపెనీలను సంప్రదిస్తామన్నారు. అయితే, కొత్తగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవ్వాలనుకునే వారికే పరీక్ష నిర్వహణ ప్రతిపాదన అని, ప్రస్తుతమున్న వారికి కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న వారికి అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక, ప్రభుత్వం తీసుకొచ్చే సవరణలతో, ఇండిపెండెంట్ డైరెక్టర్ల డేటా బ్యాంకును ఏర్పాటు చేయడంతోపాటు, నిర్వహణ బాధ్యతలను ఐఐసీఏ ఏజెన్సీ చూస్తుందని మంత్రి చెప్పారు. ఇండిపెండెంట్ డైరెక్టర్లు కంపెనీల పాలన విధానాలను పర్యవేక్షిస్తూ, సలహాదారులుగా వ్యవహరిస్తుంటారు. -
‘ఇది ఇస్లామిక్ దేశం కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : షరియత్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి భారత్ ఇస్లామిక్ దేశం కాదని బీజేపీ అధికార ప్రతినిధి మీనాకాశీ లేఖీ అన్నారు. ఇస్లాం చట్టాలకు అనుగుణంగా దేశంలో ప్రతి జిల్లాలో షరియత్ కోర్టులు (దారుల్ ఖ్వాజా) ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం స్పందించిన లేఖీ... షరియత్ కోర్టులు ఏర్పాటు చేయడానికి దేశంలో చోటులేదని, ఇదేవి ఇస్లాం దేశం కాదని వ్యాఖ్యానించారు. షరియత్ కోర్టులు ఏర్పాటు చేసే హక్కు ఆలిండియా ముస్లిం లా బోర్డుకు లేదని కేంద్ర సహాయ మంత్రి పీపీ చౌదరి అన్నారు. అవి రాజ్యాంగ విరుద్ధమైనవని, వీటి వెనుకు రాజకీయ నాయకుల హస్తం ఉందని తెలిపారు. షరియత్ కోర్టులు చట్ట విరుద్ధమని, వాటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు యూపీ వక్ఫ్ బోర్టు చైర్మన్ సయ్యద్ వాసిం రిజ్వీ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. యూపీలో ప్రస్తుతం 40 షరియత్ కోర్టులు ఉన్నాయని, అవన్ని చట్టబద్దమైనవేనని ముస్లిం లా బోర్డు సభ్యుడు, సీనియర్ న్యాయవాది జాఫర్యాబ్ జిలానీ పేర్కొన్నారు. ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కోర్టులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. -
హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధం: పీపీ చౌదరి
హైదరాబాద్: హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి పీపీ చౌదరి స్పందించారు. హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి అన్నారు. ఆదివారాం బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవాదుల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఆరుగురు హైకోర్టు జడ్జిలను నియమించనున్నట్లు తెలిపారు. హైకోర్టు కొలీజియం సిఫారసు చేస్తే మిగతా నియామకాల గురించి పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్రెడ్డి, రామచందర్రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పేదల ఆర్యోగ్యానికి మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గుండె శస్త్ర చికిత్సలో ఉపయోగించే స్టంట్లను రూ. 20 వేలకే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చాలా గొప్పదని గుర్తుచేసుకున్నారు. హైకోర్టు విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు విభజనకు పరస్పరం సహకరించుకోవాలని దత్తాత్రేయ అన్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ పరిపాలన పారదర్శకంగా కొనసాగుతుంటే. రాష్ట్రంలో మాత్రం నియంతృత్వ, కుటుంబ పాలన, అవినీతి పాలనా కొనసాగుతోందని విమర్శించారు.