పెనాల్టీలపై పునరాలోచించండి
ఎస్‌బీఐ, ప్రైవేటు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సూచన
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి ఖాతాల్లో నెలవారీ కనీస నగదు నిల్వలను (ఎంఏబీ) ఉంచకపోతే భారీగా పెనాల్టీలు విధించాలని ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసలు వ్యక్తం అవుతుండడంతో ఈ విషయంలో పునరాలోచించాలని ఎస్‌బీఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఎంఏబీలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాలపై ప్రాంతాన్ని బట్టి రూ.20 నుంచి రూ.100 వరకు, కరెంటు ఖాతాలపై రూ.500 వరకు పెనాల్టీ విధించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
అలాగే, హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల్లో ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నగదు నిల్వలను రూ.5,000కు పెంచింది. బ్యాంకుల్లో ఉచితంగా నగదు జమలను నెలలో మూడుకే పరిమితం చేసింది. సొంత బ్యాంకు ఏటీఎంలో నెలలో ఐదు ఉచిత లావాదేవీలు దాటిన తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10, ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు దాటితే రూ.20 చొప్పున చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు 31 కోట్ల సేవింగ్స్ ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి.
ఈ నేపథ్యంలో ఎంఏబీలపై జరిమానాలతోపాటు నగదు లావాదేవీలు, ఏటీఎం ఉపసంహరణలపై చార్జీల విధింపును మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం ఎస్‌బీఐతోపాటు ప్రైవేటు బ్యాంకులను కోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెలలో బ్యాంకు శాఖలో నగదు జమలు మూడు సార్లు దాటితే ప్రతీ లావాదేవీపై రూ.150 చార్జీ విధించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులు కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఖాతాదారులపై భారం...
దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ బ్యాంకు శాఖల్లో ప్రస్తుతం చెక్‌బుక్ లేని ఖాతాలో కనీస నగదు నిల్వ రూ.500, చెక్‌బుక్ సదుపాయం ఉన్న ఖాతాలో రూ.1,000గా ఉంది. అయితే, ఏప్రిల్ 1 నుంచి మెట్రోల్లో కనీస బ్యాలెన్స్‌ను రూ.5,000, అర్బన్ ప్రాంతాల్లో రూ.3,000, సెమీ అర్బన్ శాఖల్లో రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,000గా ఎస్‌బీఐ ఖరారు చేసింది. దీంతో 31 కోట్ల ఖాతాదారులపై భారం పడనుంది. మిగిలిన ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఎస్‌బీఐ బాటలో నడిచే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ సూచనను ఒకవేళ ఎస్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటే ఖాతాదారులకు కొంచెం ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1న ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ నిర్ణయాలు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఖాతాదారులకూ అమలు కానుంది.