త్వరలో సర్కారీ షేర్ల మేళా!
♦ 51 కంపెనీల్లో మైనారిటీ వాటాల విక్రయానికి రెడీ...
♦ మర్చంట్ బ్యాంకర్లకు ఆహ్వానం..
♦ ప్రస్తుతం ఎస్‌యూయూటీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వాటా
♦ మూడేళ్లలో పూర్తిగా అమ్మేసే ప్రణాళిక...
♦ జాబితాలో ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్ వంటి దిగ్గజ కార్పొరేట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ద్వారా ఖజానా నింపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు సహా మొత్తం 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో తనకున్న మైనారిటీ వాటాల అమ్మకం ప్రక్రియకు తెరతీసింది. రానున్న మూడేళ్లలో ఈ కంపెనీల నుంచి పూర్తిగా వైదొలగాలన్నది సర్కారు ప్రణాళిక. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. వాటా విక్రయ జాబితాలో రిలయన్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్), హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో పాటు పలు టాటా గ్రూప్ కంపెనీలు కూడా ఉన్నాయి. ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా కేంద్రానికి ఈ 51 లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో మైనారిటీ వాటాలు ఉన్నాయి.
మూడేళ్ల ప్రక్రియ...
ప్రభుత్వం విడుదల చేసిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎఫ్‌పీ) ప్రకారం ఎస్‌యూయూటీఐ దాదాపు మూడు మర్చంట్ బ్యాంకర్లు/సలహాదారులు, బ్రోకింగ్ సంస్థలను నియమించుకోనుంది. వచ్చే మూడేళ్లపాటు ఈ 51 కంపెనీల్లో మైనారిటీ వాటా అమ్మకం విషయంలో ఎస్‌యూయూటీఐకి మర్చంట్ బ్యాంకర్లు తగిన సహకారాన్ని అందించనున్నారు. ఆఫర్ ఫల్ సేల్(ఓఎఫ్‌సీ), బ్లాక్ డీల్, బల్క్ డీల్ ఇతరత్రా మార్గాల్లో ఈ వాటా విక్రయాలకు సంబంధించి తగిన సలహాలను ఇస్తారు. కాగా, మర్చెంట్ బ్యాంకర్లు తమ బిడ్‌లను ఆగస్టు 1 కల్లా సమర్పించాల్సి ఉంటుందని ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్నారు.
ఎస్‌యూయూటీఐకు ఉన్న మొత్తం వాటాలన్నింటికీ కలిపి మర్చెంట్ బ్యాంకర్లు ఒకే బిడ్‌ను సమర్పించాల్సి ఉంటుందని.. అయితే, 51 కంపెనీల్లో వాటా అమ్మకాలకు సంబంధించి విడివిడిగా అమ్మకం ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంది. మార్కెట్ అధ్యయన నివేదిక, ఇష్యూ ప్రైసింగ్ సహా రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ఇష్యూల్లో పాల్గొనేవిధంగా తగిన అవగాహన కలిగించడం, ఇష్యూకి తగిన సమయం వరకూ అన్ని విధాలుగా మర్చెంట్ బ్యాంకర్లు ఎస్‌యూయూటీఐకి తమ సలహాలు, వ్యూహాలన్నింటినీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధానమైన దేశీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాను కూడా సమర్పించాలని ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్నారు.
డిజిన్వెస్ట్‌మెంట్‌కు జోష్...
ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల రూపంలో(డిజిన్వెస్ట్‌మెంట్) రూ.56,500 కోట్ల భారీ మొత్తాన్ని సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.36,000 కోట్లను పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా, మిగతా రూ.20,500 కోట్లను లాభాల్లో ఉన్న, నష్టాలను ప్రకటిస్తున్న కంపెనీల్లో వ్యూహాత్మక వాటా అమ్మకం రూపంలో సమీకరించాలనేది ప్రణాళిక. ఎస్‌యూయూటీఐ వాటాల విక్రయంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ను పరుగులు పెట్టించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏర్పాటు చేయనున్న సీపీఎస్‌ఈ(కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు) రెండో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లో తమకు వాటాలున్న కంపెనీలను చేర్చే అంశాన్ని కూడా ఎస్‌యూయూటీఐ ప్రత్నామ్యాయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
యూటీఐకి అనుబంధంగా...
అంతక్రితం ఉన్న యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(యూటీఐ) నుంచి విభజించి దానికి అనుబంధంగా ఈ ఎస్‌యూయూటీఐని 2003లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికిందికి 51 కంపెనీలకు సంబంధించిన మైనారిటీ వాటాలను చేర్చింది. అయితే, వీటిలో ఎన్‌ఎస్‌డీఎల్, ఎస్‌టీసీఐ ఫైనాన్స్, ఓవర్ ద కౌంటర్ ఎక్స్ఛేంజ్, స్టాక్ హోల్డింగ్స్ కార్పొరేషన్, యూటీఐ-ఐఏఎస్ లిమిటెడ్, యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ సర్వీసెస్, నార్త్ ఈస్టర్న్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎన్‌ఎస్‌డీఎల్ ఈ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ఈ 8 ఎనిమిది కంపెనీలు అన్‌లిస్డెడ్‌వి. 2014 మార్చిలో యాక్సిస్ బ్యాంక్‌లో 9 శాతం వాటాను ఎస్‌యూయూటీఐ ద్వారా విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లకుపైగానే సమీకరించిన సంగతి తెలిసిందే. ఎస్‌యూయూటీఐకి వాటాలున్న ఇతర లిస్టెడ్ కంపెనీల్లో అంబుజా సిమెంట్స్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, టాటా పవర్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లు కూడా ప్రధానంగా ఉన్నాయి.