సాక్షి, న్యూఢిల్లీ : రద్దయిన నోట్లపై కేంద్రం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లు కలిగి ఉన్న వారిపై తాము ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు తదుపరి నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పింది. అంతేకాక రద్దయిన నోట్లకు ఎలాంటి కొత్త విండో కూడా తెరిచేది లేదనీ స్పష్టం చేసింది. పాత నోట్లను డిపాజిట్ చేయని వారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధా మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై, విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది. 2016 డిసెంబర్ 31 వరకు డిపాజిట్ చేయని పిటిషనర్లను వద్దనున్న పాత నోట్లను పట్టుకోవడం కోసం ఎలాంటి విచారణలు జరుపమని కూడా కేంద్రం పేర్కొంది.
రద్దయిన నోట్లను కలిగి ఉంటే జరిమానాలు విధిస్తామని అంతకముందే ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు రూ.పది వేలు అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నా.. వాటిని బదిలీ చేసినా.. స్వీకరించినా శిక్ష విధించదగ్గ నేరంగా పరిగణిస్తారని, ఒక వ్యక్తి వద్ద గరిష్టంగా పది రద్దయిన నోట్లను మాత్రమే అనుమతిస్తారని, దీనికోసం కేంద్రం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్టు తెలిసింది. అంతేకాక ఈ నోట్లు పెద్ద మొత్తంలో ఉండే క్రిమినల్ నేరంగా పరిగణించనున్నట్టు కూడా కేంద్రం హెచ్చరించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు జరిగిన విచారణలో పెద్ద నోట్లను కలిగి ఉంటే తాము ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్రం, సుప్రీంకోర్టుకి తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment