అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదుగుతాం! | To grow into international brand! | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదుగుతాం!

Published Fri, Sep 29 2017 12:20 AM | Last Updated on Fri, Sep 29 2017 3:16 AM

To grow into international brand!

నాలుగైదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను లక్షకు చేరుస్తాం ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 18 లక్షలకు విస్తరిస్తాం .త్వరలో భారత్‌లోనూ డిజైన్‌– రీసెర్చ్‌–డెవలప్‌మెంట్‌ లావా ఇంటర్నేషనల్‌ వీపీ మహాజన్, సీఎంఓ రైనా చైనాలోని షెంజెన్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం సందర్శన డిజైన్, టెస్టింగ్‌కు అధిక ప్రాధాన్యమని వివరణ  

ఎనిమిదేళ్లలోనే టాప్‌ దేశీ బ్రాండ్స్‌లో ఒకటిగా మారిన లావా మొబైల్స్‌... భారత్‌ నుంచి సిసలైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశంలో తనకున్న హ్యాండ్‌సెట్‌ తయారీ సామర్థ్యాన్ని విస్తరించటం... అదే సమయంలో మిగతా పోటీదారులకన్నా భిన్నంగా రీసెర్చ్‌–డెవలప్‌మెంట్‌ కార్యకలాపాల్ని పటిష్ఠం చేసుకోవటం అనే రెండంచెల వ్యూహంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రెండేళ్ల కిందట నోయిడాలో తొలి అసెంబ్లింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేసిన సంస్థ... మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో గతేడాది అక్కడే మరో ప్లాంటునూ ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం అక్కడే మూడో ప్లాంటును పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ సామర్థ్యంతో ఇంకొక ప్లాంటును కూడా ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఇవన్నీ అనుకున్నట్లు పూర్తయితే సంస్థ ఉత్పాదక సామర్థ్యం నెలకు 18 లక్షల మొబైల్స్‌కు చేరుతుంది. ‘‘ఇవన్నీ అమలు కావటానికి కొంత సమయం పడుతుంది. ఈ లోగా మేం మార్కెట్‌ విస్తరణపై కూడా దృష్టి పెడుతున్నాం. నిజానికిపుడు మా అమ్మకాలు, ఉత్పత్తి అన్నీ బాగున్నాయి. కానీ అది సరిపోదు.

కాబట్టే మాకు మేమే సవాలు విసురుకుంటూ ఎక్సలెన్స్‌ స్థాయిని చేరేలా అడుగులేస్తున్నాం’’ అని సంస్థ ప్రొడక్ట్‌ విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ మహాజన్‌ తెలియజేశారు. భారతదేశంలోని పలు భాషాపత్రికల పాత్రికేయులకు చైనాలోని షెంజెన్‌లో ఉన్న రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సౌకర్యాల్ని ఆయన చూపించారు. నమ్మకమైన బ్రాండ్‌గా ఎదిగేందుకు డిజైన్, సాఫ్ట్‌వేర్‌ పరిశోధన, టెస్టింగ్‌ రంగాల్లో తామెలా కృషి చేస్తున్నదీ ప్రత్యక్షంగా వివరించారు.

ఒక్కో ఫోన్‌కు సగటున ఆరునెలలు...
లావా ఇంటర్నేషనల్‌కు ప్రధాన మార్కెట్‌ ఇండియానే అయినా... ప్రస్తుతం 13 దేశాల్లో తమ ఫోన్లను విక్రయిస్తోంది. కొన్ని దేశాల్లో మార్కెట్‌ లీడర్‌గానూ ఉంది. సంస్థకు దేశంలో 15వేల మంది ఉద్యోగులుండగా చైనాలోని రీసెర్చ్‌– డెవలప్‌మెంట్‌ కేంద్రంలో దాదాపు 400 మంది వరకూ పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా చైనీయులే. ‘‘రాత్రికి రాత్రి ఏవో కొన్ని స్పెసిఫికేషన్లను కాంట్రాక్టు తయారీదారులకు చెప్పేసి... వారం రోజుల్లో ఫోన్‌ తీసుకుని మార్కెట్లోకి విడుదల చేయటమనే సంస్కృతికి మేం వ్యతిరేకం.

భారీ డిజైన్‌ టీమ్‌తో పాటు ఫోన్లో దాదాపు 70 శాతాన్ని ఆక్రమించే సర్క్యూట్, చిప్, కెమెరా, ఎల్‌సీడీ, స్పీకర్, బ్యాటరీ వంటి ప్రధాన పరికరాల్ని ఎంపిక చేసేందుకు అనుభవజ్ఞులైన నిపుణులున్నారు. ఆ పరికరాల్ని రకరకాలుగా టెస్టింగ్‌ చేసే సౌకర్యాలున్నాయి. అవన్నీ చూశాకే మా ఫోన్‌ను తయారీ దారులకిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తవటానికి ఒకో ఫోన్‌కు సగటున ఆరునెలలు పడుతోంది’’ అని దీపక్‌ వివరించారు. తమ ఫోన్లలోని పరికరాల పనితీరు తాము చెప్పినదానికన్నా మెరుగ్గానే ఉంటుందని, వినియోగదారుల విశ్వాసం పొంది దేశం నుంచి నిజమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగేందుకు తమ టీమ్‌ కృషి చేస్తోందని చెప్పారాయన.

దేశంలోనే రీసెర్చ్‌ కూడా!!
భారతదేశంలోనే పూర్తిస్థాయి రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తమకున్నా... అది నెరవేరటానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చని దీపక్‌ చెప్పారు. ‘‘చైనాలోని అత్యుత్తమ యూనివర్సిటీలకు వెళ్లి యువకుల్ని రిక్రూట్‌ చేసుకుంటున్నాం. వారికి సీనియర్లు మార్గదర్శనం చేస్తున్నారు. ఇండియాలో మొబైల్‌ ఎకో సిస్టమ్‌ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. కాబట్టి సమయం పడుతుంది’’ అని చెప్పారాయన. లావా రీసెర్చ్, డిజైన్‌ ఉద్యోగుల్లో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే కావటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌ పనిచేస్తోందని, ఈ బృందం తొలిసారిగా డిజైన్‌ చేసిన ఫీచర్‌ ఫోన్‌ను ఇటీవలే మార్కెట్లోకి తెచ్చామని కూడా దీపక్‌ ఈ సందర్భంగా చెప్పారు. చైనాలో ఈ స్థాయి ఆర్‌ అండ్‌ డీ నెట్‌వర్క్‌ ఉన్న భారతీయ సంస్థ తమదేనన్నారు.


నిజం! ఇది ఇండియా టైమ్‌!!
ప్రపంచంలోని దిగ్గజ బ్రాండ్లు తొలుత అమెరికాలో పుట్టినా... తరవాత ఆ అవకాశాలు యూరప్, కొరియా, జపాన్‌ మీదుగా ప్రయాణించి చైనాకు చేరాయని, ఇపుడవి ఇండియా తలుపుతడుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సునీల్‌ రైనా తెలియజేశారు. ‘‘ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి మేమూ సిద్ధంగా ఉన్నాం. నా అంచనా ప్రకారం వచ్చే దశాబ్దంలో ఇండియా నుంచి సిసలైన అంతర్జాతీయ బ్రాండ్లు ఉద్భవిస్తాయి’’ అని చెప్పారాయన.

లావాకు సొంత రిటైల్‌ నెట్‌వర్క్‌ ఉందని, అదే తమ బలమని చెప్పారాయన. మార్కెటింగ్‌లో దూకుడుకన్నా నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యమన్నది తమ ఉద్దేశమని రైనా తెలియజేశారు. కాగా సంస్థ ఇప్పటికే మార్కెటింగ్‌లో రెండేళ్ల వారంటీ అనే సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. వీటికి సంబంధించి తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీతో మరో కొత్త ప్రచారం ఆరంభించబోతున్నట్లు కూడా తెలిసింది.

(ఎం.రమణమూర్తి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement