సాక్షి,న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్స్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినా ఆయా సంస్థలు వినియోగదారులకు పాత రేట్లనే వర్తింపచేస్తుండటం ఇక చెల్లుబాటు కాదు. అలాంటి సంస్థల పనిపట్టేందుకు వినియోగదారులకు ఆసరాగా నిలిచేలా కేంద్రం నేషనల్ యాంటీ ప్రాఫిటీరింగ్ అథారిటీ (ఎన్‌ఏఏ) పేరిట జీఎస్‌టీ కింద మరో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం ఎన్‌ఏఏకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్‌టీ రేట్లను తగ్గించిన రీతిలో వినియోగదారులకు చేరేలా ఈ అథారిటీ పర్యవేక్షిస్తుంది.
తగ్గించిన పన్ను రేట్ల ప్రయోజనాన్ని ఏ సంస్థలు వినియోగదారులకు బదలాయించని పక్షంలో రాష్ర్టాల్లో ఏర్పాటయ్యే స్క్రీనింగ్ కమిటీలకు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఆయా కమిటీలు పరిశీలించిన అనంతరం ఏమైనా సంస్థలు వినియోగదారులకు తగ్గించిన రేట్లను బదలాయించకుంటే వాటిపై ఎన్‌ఏఏ చర్యలు చేపడుతుంది.
బాధిత వినియోగదారుడికి వడ్డీతో సహా తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటారు. ఈ తరహా మోసాలు పెద్ద ఎత్తున సాగితే ఆ వ్యాపార సంస్థపై జరిమానా విధించడం, జీఎస్‌టీ రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయడం వంటి తీవ్ర చర్యలూ చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment