న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు వార్షిక వ్యాపారంపై జీఎస్‌టీ మినహాయింపు ఉండగా... దీన్ని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచింది. దీనికితోడు ఒక శాతం పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని రూ.1.5 కోట్లు చేయాలని గతంలోనే నిర్ణయించగా... ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కౌన్సిల్ ప్రకటించింది.
భారీ వరదలతో దెబ్బతిన్న కారణంగా... పునర్నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అంతర్రాష్ట్ర రవాణాపై రెండేళ్ల పాటు ఒక శాతం విపత్తు సెస్సును విధించుకునే అవకాశాన్ని కేరళ రాష్ట్రానికి కౌన్సిల్ కల్పించింది. ఈ మేరకు గురువారం జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వార్షికంగా రూ.20 లక్షల టర్నోవర్ లోపు ఉంటే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఉందని, దీన్ని రూ.40 లక్షలకు పెంచామని చెప్పారు.
పర్వత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండగా, ఇకపై రూ.20లక్షలు అవుతుందన్నారు. జీఎస్‌టీ మినహాయింపును రెట్టింపు చేయడం వల్ల... అన్ని రాష్ట్రాలు అమలు చేస్తే రూ.5,200 కోట్ల మేర పన్ను రాబడి తగ్గుతుందని అంచనా. జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్‌ఎంఈలు, ట్రేడర్లు, సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. సులభమైన ప్రజా అనుకూల జీఎస్‌టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
కాంపోజిషన్ స్కీమ్ మినహాయింపులు
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి వరకు టర్నోవర్ ఉన్న వారు... కాంపోజిషన్ స్కీమ్ కింద టర్నోవర్‌పై ఒక శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచుతూ కౌన్సిల్ నవంబర్ నాటి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్లు, వస్తు, సేవల సరఫరా దారులు రూ.50 లక్షల్లోపు టర్నోవర్ ఉంటే, కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
కాంపోజిషన్ స్కీమ్‌లో టర్నోవర్ పరిమితి పెంచటం వల్ల రూ.3,000 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చని అంచనా. ఈ నిర్ణయాలు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపారులకు (ఎంఎస్‌ఎంఈ) ఉపశమనం కల్పిస్తాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకునే వ్యాపారులు వార్షికంగా ఒకేసారి ట్యాక్స్ రిటర్ను వేస్తే సరిపోతుందని, పన్ను మాత్రం త్రైమాసికానికి ఓ సారి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారాయన. ‘‘జీఎస్‌టీలో ఎక్కువ భాగం వ్యవస్థీకృత రంగం, పెద్ద కంపెనీల నుంచే వస్తోంది.
ఈ నిర్ణయాలు ఎంఎస్‌ఎంఈలకు మేలు చేస్తాయి. వారికి పలు ఆప్షన్లు ఇచ్చాం. సేవల రంగంలో ఉంటే, 6 శాతం కాంపౌండింగ్ పొందొచ్చు. తయారీ రంగంలో ఉంటే రూ.1.5 కోట్ల టర్నోవర్‌పై ఒక శాతం కాంపౌండింగ్ ఎంచుకోవచ్చు. వీరు రూ.40 లక్షల వార్షిక టర్నోవర్ వరకు పన్ను మినహాయింపును కూడా పొందొచ్చు. సరుకుల సరఫరాదారులకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, చెల్లింపు విషయంలో రూ.40 లక్షలు, రూ.20 లక్షల పరిమితులు ఉన్నాయి. పరిమితి పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది’’ అని అరుణ్ జైట్లీ వివరించారు.
ఇతర నిర్ణయాలు...
⇒ రియల్ ఎస్టేట్‌పై జీఎస్‌టీ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఏడుగురు సభ్యుల మంత్రివర్గ గ్రూపును ఏర్పాటు చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.
⇒ లాటరీలపైనా ఇదే పరిస్థితి నెలకొనడంతో దీన్నీ మంత్రివర్గ బృందమే తేల్చనుంది.
⇒ ప్రస్తుతం రూ.20 లక్షల్లోపు టర్నోవర్‌కు పన్ను మినహాయింపు ఉన్నప్పటికీ... 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారని కేంద్ర రెవెన్యూ సెక్రటరీ అజయ్‌భూషణ్ పాండే తెలిపారు. రూ.40 లక్షల టర్నోవర్ వరకు మినహాయింపు అనేది సరుకుల వర్తకానికి, ఒకే రాష్ట్రం పరిధిలో వాణిజ్యానికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య లావాదేవీలకు ఇది వర్తించదన్నారు.
⇒ జీఎస్‌టీ కింద 1.7 కోట్ల వ్యాపారులు నమోదు చేసుకోగా, వీరిలో 18 లక్షల మంది కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకున్నారు. వీరు మూన్నెళ్లకోసారి పన్ను చెల్లించాలి. మిగిలిన వారు ప్రతీ నెలా పన్ను చెల్లించాలి. పైగా కాంపోజిషన్ స్కీమ్‌లో వ్యాపారులు రికార్డులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.
లక్షలాది వర్తకులకు మేలు: పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: రూ.40 లక్షల టర్నోవర్ కలిగిన వ్యాపారులకూ జీఎస్‌టీ నుంచి మినహాయింపు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. ఇది లక్షలాది వ్యాపారులకు మేలు చేస్తుందని, వ్యాపార సులభత్వాన్ని పెంచుతుందని పేర్కొంది. ‘‘జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం ఉత్పత్తుల వ్యయాన్ని తగ్గిస్తుంది. ఎంఎస్‌ఎంఈల పోటీతత్వాన్ని పెంచుతుంది’’ అని సీఐఐ పేర్కొంది. కాంపోజిషన్ స్కీములో మూడు నెలలకోసారి పన్ను చెల్లింపు, ఏడాదికోసారి రిటర్నుల దాఖలు అన్నది పన్నుల విధానాన్ని మరింత సులభంగా మార్చేస్తుందని, ఎంఎస్‌ఎంఈ రంగంపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. లక్షలాది చిన్న, మధ్య స్థాయి వర్తకులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అసోచామ్ పేర్కొంది.జీఎస్‌టీ మినహాయింపు రూ.40 లక్షలు చేయడం వల్ల, నమోదిత పన్ను చెల్లింపుదారుల సంఖ్య 50–60% మేర తగ్గుతుందని, వారికి నిబంధనల అమలు భారం తొలగిపోతుందని కేపీఎంజీ పార్ట్‌నర్ సచిన్ మీనన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment