జీఎస్‌టీ అమలు తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి | GST impact, global cues to set market trajectory | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ అమలు తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి

Published Mon, Jul 3 2017 3:52 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

జీఎస్‌టీ అమలు తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి

జీఎస్‌టీ అమలు తీరుపై ఇన్వెస్టర్ల దృష్టి

జీఎస్‌టీ... ఆరంభంలో కొన్ని ఇక్కట్లు  
మార్కెట్లో ఒడిదుడుకులకు అవకాశం ∙
స్టాక్‌ మార్కెట్‌ గమనంపై విశ్లేషకుల అంచనాలు


జీఎస్‌టీ అమలు నేపథ్యంలో ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు గురికావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రుతుపవనాల విస్తరణ, తయారీ, సేవల రంగాలకు చెందిన గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, తదితర అంశాలు మార్కెట్‌ను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు.

సోమవారం తయారీ గణాంకాలు
భారత్‌లో జూన్‌ నెలలో  తయారీ రంగానికి చెందిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలను మార్కెట్‌ ఎకనామిక్స్‌ సంస్థ సోమవారం(ఈ నెల 3న) వెల్లడిస్తుంది. ఇక సేవల రంగానికి చెందిన పీఎంఐ గణాంకాలు   బుధవారం(ఈ నెల5న) వస్తాయి.

అమ్మకాల ఒత్తిడి !
దేశవ్యాప్తంగా జీఎస్‌టీ అమలు తీరు ఎలా ఉందోనని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తున్నారని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(బిజినెస్‌) వి.కె.శర్మ పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాల కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారని, ఈ సమావేశ వివరాలు కూడా మార్కెట్‌పై తగినంతగా ప్రభావం చూపుతాయని వివరించారు. జీఎస్‌టీ అమలులో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పవని ట్రేడ్‌ స్మార్ట్‌ ఆన్‌లైన్‌ డైరెక్టర్‌ విజయ్‌ సింఘానియా చెప్పారు. కొత్త వృద్ధి అంశాలు ఏమీ లేనందున మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. గత నెల వాహన విక్రయ గణాంకాలు వెల్లడైనందున వాహన షేర్లు వెలుగులో ఉంటాయని వివరించారు. ఇక అంతర్జాతీయ అంశాలు, ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు కూడా ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.

ఒడిదుడుకులకు అవకాశం.!
జీఎస్‌టీ అమలు కారణంగా తలెత్తిన ఇబ్బందులపై కంపెనీ యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలు. మార్కెట్‌ ఒడిదుడుకులకు కారణమయ్యే అవకాశాలున్నాయని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేశ్‌ జోషి చెప్పారు. ఒక దేశం–ఒక పన్ను విధానమైన జీఎస్‌టీ అమలు స్టాక్‌మార్కెట్‌పై సానుకూలంగానే ఉంటుందని ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డైరెక్టర్‌ అభ్నిశ్‌ కుమార్‌ సుధాంశు చెప్పారు. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పవని వివరించారు. ఈ వారం మార్కెట్‌పై సేవల, తయారీ రంగానికి సంబంధించి పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ గణాంకాల ప్రభావం కూడా ఉంటుందని పేర్కొన్నారు.

మూడు నెలల గరిష్టానికి జూన్‌లో విదేశీ పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లో గత నెలలో రూ.29,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. గత మూడు నెలల్లో ఇవే అత్యధిక విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు. అంతే కాకుండా వరుసగా ఐదో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు కొనసాగాయి.  జీఎస్టీ అమల్లోకి రావడం, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు దీనికి కారణం. డిపాజిటరీల గణాంకాల ప్రకారం.. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.3,617 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.25,685 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. మొత్తం రూ.29,302 కోట్లకు విదేశీ పెట్టుబడులు చేరాయి. మార్చి(ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.56,261 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు) తర్వాత ఈ ఏడాది గత నెలలోనే విదేశీ పెట్టుబడులు అత్యధికంగా వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement