
న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.2,540 కోట్ల నికర లాభాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం రూ.2,188 కోట్లతో పోలిస్తే 16 శాతం వృద్ధి సాధించామని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది.
క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే, నికర లాభం 6 శాతం పెరిగిందని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ చెప్పారు. గత క్యూ2లో రూ.12,434 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 20 శాతం వృద్ధితో రూ.14,861 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 7 శాతం ఎగసిందని వివరించారు. ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.
ఆదాయ వృద్ధి 10–12 శాతం రేంజ్‌లో..
ఆదాయం, మార్జిన్ల వృద్ధి అంశాల్లో సీక్వెన్షియల్‌గా పటిష్టమైన వృద్ధిని సాధిస్తున్నామని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే జోరును కొనసాగించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. డాలర్ల పరంగా చూస్తే, ఈ క్యూ2లో నికర లాభం 5 శాతం వృద్ధితో 35.67 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 209 కోట్ల డాలర్లకు పెరిగాయని చెప్పారు.
నిర్వహణ మార్జిన్ 9 శాతం వృద్ధితో రూ.2,966 కోట్లకు చేరిందని వివరించారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10–12 శాతం వృద్ది సాధించగలదన్న అంచనాలను ఆయన వెల్లడించారు. ఈ క్యూ2లో 11,683 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, దీంతో తమ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,27,875కు పెరిగిందని వివరించారు. అట్రిషన్ రేటు 17.1 శాతంగా ఉందని వివరించారు.
25.8 శాతానికి ఆర్‌ఓఈ
రన్–రేట్ ప్రాతిపదికన(పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే) నికర లాభం రూ.10,000 కోట్లు దాటేసిందని కంపెనీ సీఎఫ్‌ఓ ప్రతీక్ అగర్వాల్ పేర్కొన్నారు. రూ.4,000 కోట్ల షేర్ల బైబ్యాక్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, దీంతో తమ రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 25.8 శాతానికి పెరిగిందని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ మార్జిన్ 20–21 శాతం రేంజ్‌లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ 2.7 శాతం నష్టంతో రూ.953 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment