హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేటు తగ్గింది...
- 9.35 శాతానికి తగ్గింపు;దేశీ బ్యాంకింగ్‌లో అత్యల్ప రేటు ఇది..
- స్వల్పంగా తగ్గించిన కెనరాబ్యాంక్...
- యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల కోత..
ముంబై: భారత ప్రైవేటు రంగంలో రెండవ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన కనీస రుణ రేటు (బేస్ రేటు)ను 0.35 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.35 శాతానికి చేరింది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమలో అతి తక్కువ బేస్ రేటు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్‌బీఐ, ఐసీఐసీఐల బేస్‌రేటు 9.7 శాతంగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా నిర్ణయం బ్యాంకులు తమ బేస్ రేటును మరింత తగ్గించడానికి దారితీసే అంశం. మంగళవారం నుంచే తాజా రేటు అమల్లోకి వస్తుంది.
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీ రేటు- రెపో ఈ ఏడాది ముప్పావు శాతం తగ్గింది (ప్రస్తుతం 7.25 శాతం). ఈ ప్రయోజనంలో దాదాపు సగ భాగాన్ని ఇప్పటికే పలు బ్యాంకులు ‘బేస్ రేటు’ తగ్గింపు రూపంలో కస్టమర్లకు బదలాయించాయి. బేస్ రేటు తగ్గింపు వల్ల దానికి అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా రుణాలపై నెలవారీ చెల్లింపుల భారం తగ్గుతుంది. తదుపరి రెపో కోతకు తొలుత ఈ ఏడాది తగ్గించిన రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు మరింతగా బదలాయించాలని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా స్పష్టం చేస్తున్నారు.
యాక్సిస్ బ్యాంక్‌కు వస్తే...
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ పలు డిపాజిట్లపై వడ్డీరేటును 20 నుంచి 50 బేసిస్ పాయింట్ల (అర శాతం) శ్రేణిలో తగ్గించింది. తాజా రేట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం- మూడు నెలల నుంచి ఏడాది వరకూ రేటు పావు శాతం నుంచి అరశాతం శ్రేణిలో తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలవ్యవధి డిపాజిట్లపై రేటు 0.20 శాతం వరకూ తగ్గాయి. రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వరకూ డిపాజిట్ రేటు 0.30 శాతం తగ్గాయి.
కెనరా బ్యాంక్‌కు రూ.947 కోట్లు
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.947 కోట్ల తాజా మూలధనాన్ని కేటాయించింది. ఈ తాజా నిధుల కల్పనకు అనుగుణంగా ప్రభుత్వానికి ప్రాధాన్యతాపూర్వక ప్రాతిపదికన తగిన ఈక్విటీ షేర్లు జారీ చేయడానికి సోమవారం జరిగిన బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.20,088 కోట్ల తాజా మూలధనం కేటాయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా కెనరాబ్యాంక్ కూడా కనీస బేస్ రేటును స్వల్పంగా 0.1 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 9.9 శాతానికి తగ్గింది. ఈ రేటు సెప్టెంబర్ 3 నుంచీ అమల్లోకి వస్తుంది.